అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు.. జిల్లాలోని తాగునీటి సరఫరా ప్రాజెక్టులను తీవ్రంగా(Drinking water supply projects severely damaged in Anantapur district) నష్టపరిచాయి. జిల్లావ్యాప్తంగా శ్రీరామిరెడ్డి, సత్యసాయి తాగునీటి ప్రాజెక్టుల పంప్‌హౌస్‌లలోకి వరద నీరు చేరింది. శ్రీరామిరెడ్డి ప్రాజెక్టు ద్వారా దాదాపు 960 గ్రామాలు, సత్యసాయి పథకం ద్వారా 610 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేవారు. సత్యసాయిబాబ.. ఉన్నతాశయంతో మారుమూల గ్రామాలు, తండాల ప్రజల దాహార్తిని తీర్చటానికి ఈ పథకాన్ని నిర్మించి ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే దీని నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో ఎల్అండ్టీ సంస్థ ద్వారా తాగునీటి నిర్వహణ చేయిస్తుండగా.. ఆ సంస్థకు సరిగా బిల్లులు చెల్లించకపోవడం తదితర కారణాలతో ఆరు నెలల క్రితం ఆ సంస్థ తాగునీటి ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి ప్రభుత్వ అధికారులే ఈ బాధ్యతలు చూస్తున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలతో జిల్లా వ్యాప్తంగా పదిచోట్ల పంపుహౌస్లోకి నీళ్లు చేరడంతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
భారీ వర్షాలకు కదిరి, ధర్మవరం, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లోని పలు చోట్ల పంపుహౌస్లకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. కదిరి పంపుహౌస్ పరిధిలో పలుచోట్ల పైపులైన్లు, పంపులు దెబ్బతిన్నట్లు అధికారులు.. జిల్లా కలెక్టర్కు నివేదించారు. నదులకు అడ్డంగా పైపులైన్ల నిర్మాణం చేసిన చోట భారీ ప్రవాహనికి పైపులన్నీ కొట్టుకపోయాయి. దీంతో జిల్లావ్యాప్తంగా 180 గ్రామాలకు ఐదు రోజుల నుంచి తాగునీటి సరఫరా(Interruption to water supply in Anantapur district) నిలిచిపోయింది.
కదిరి సమీపంలోని కుటాగుళ్ల, ముదిగుబ్బ, నల్లమాడ, బుక్కరాయసముద్రం, తాడిపత్రి ప్రాంతాల్లో పంపుహౌస్లకు ఎక్కువగా నష్టం జరిగిందని.. మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని అధికారులు కోరారు. మరమ్మతుల కోసం ప్రాథమిక అంచనాల మేరకు రూ. 42 లక్షలు అవసరం ఉంటుందని కలెక్టర్కు తెలిపారు. నిధులు విడుదలైతే వారం రోజుల్లో మరమ్మతులు నిర్వహించి నీటి సరఫరా పునరుద్దరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో భారీ వరదలతో అల్లాడుతున్న ప్రజలకు రక్షిత మంచినీరు అందించకపోతే వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి..: Beautiful Tirumala Hills : తిరుమల కొండల్లో మేఘాల హోయలు..