Sand Mafia In Guntakallu : అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో జనాలకు ఇసుక తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం మార్కెట్ యార్డులోని స్టాక్ పాయింట్ ద్వారా ప్రజలకు నిర్దేశించిన ధరలోనే ఇసుకను అందిస్తామని ప్రకటనలు చేస్తున్నా, అది కార్యరూపంలో మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఓ వైపు జగనన్న కాలనీలు, మరోవైపు ప్రవేట్ నిర్మాణాలతో పనులు జరుగుతున్నా ఇసుక లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయి జనం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.
ఓ వైపు మార్కెట్ యార్డ్‌లోని స్టాక్ పాయింట్లు ఇసుక లేకుండా వెలవెలబోతున్నాయి. గుంతకల్లు మండల సమీప గ్రామాలలోని వంకలలో మాత్రం ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. గుంతకల్లు మండల పరిధిలోని కొంగనపల్లి వంకలో ప్రమాదకర రీతిలో తవ్వకాలు చేస్తున్నారు. ఇసుక మాఫియా ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా ఇసుకను నిల్వ ఉంచారు. అవసరాలకు తగినట్లు కర్నూలు జిల్లాలోని మద్దికేర ఇతర ప్రాంతాలకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ధర బ్లాక్ మార్కెట్లో 4000 నుండి 6000 రూపాయల వరకు అమ్ముకుంటూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఇసుక అక్రమ రవాణా గురించి పట్టించుకోవాల్సిన సెబ్ అధికారులు కానీ, రెవెన్యూ సిబ్బంది గానీ, పోలీసులు గానీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
నిత్యం అదే ప్రాంతం నుండి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు, విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఈ అక్రమ దందా జరుగుతున్నట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఇసుక స్టాప్ పాయింట్లో ఇసుక లేకపోవడంతో గుంతకల్లు పట్టణంలోని ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన పేదలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక సరఫరా నిలిచిపోవడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి.
కొంగనపల్లి గ్రామ పెద్దపెద్ద వంకల్లో ఇసుకమేటలు ఏర్పాటు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ ఇసుకను సీజ్ చేసి స్వాధీనపరచుకొని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగిస్తామని గుంతకల్లు ఆర్డీఓ రవీంద్ర తెలిపారు. అంతే కాకుండా వంకల్లో అక్రమంగా ఇసుకను తవ్విన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని అన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని, సరైన రీతిలో ప్రజలకు కావలసిన మేర ఇసుకను అందించి తమను ఆదుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
"ఇసుకను తీసి అక్రమంగా అమ్ముకుంటున్నారని మా దృష్టికి తీసుకు రావడం జరిగింది. మైన్స్ అండ్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇసుకను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకునే విధంగా చర్యలు చేపడతాం."- రవీంద్ర, గుంతకల్లు ఆర్డీఓ
ఇవీ చదవండి