Samuel Anand Kumar Committee: గత కొన్ని రోజులుగా బోయ, వాల్మీకి కులస్థులు తమను ఎస్టీల్లో చేర్చాలని నిరసనలు, ఆందోళనులు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది. ఈ మేరకు ఆ కమిటీకి చెందిన అధికారి శామ్యూల్ ఆనంద్‌కుమార్ ఈ రోజు అనంతపురంలో పర్యటించారు. బీసీ, ఎస్టీ అధికారులతో సమావేశమైన ఆయన వారి వారి సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ఇతర గిరిజన నేతలు పాల్గొని వారి సమస్యలపై కమిటీ ముందు ఉంచడంతోపాటుగా.. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరిస్తే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వెల్లడించారు.
రాష్ట్రంలోని బోయ, వాల్మీకుల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన శ్యామ్యూల్ ఆనంద్‌కుమార్ కమిటీ ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించింది. స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో బీసీ, ఎస్టీ అధికారులతో ఆనంద్‌కుమార్ సమావేశమయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎస్టీ, అలాగే వాల్మీకి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ బాధలను చెప్పుకున్నారు. కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ స్థితిగతులను కమిటీకి వివరించారు. ప్రధానంగా వాల్మీకి బోయ సంఘం నాయకులు మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాల్లో ఎప్పటినుంచో ఎస్టీ జాబితాలో తాము ఉన్నామని వెల్లడించారు. అయితే కొందరు నాయకులు చేసిన తప్పిదం వల్ల ఇక్కడ బీసీలుగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇంకా చాలా గ్రామాల్లో తాము వెనుకబాటుతో ఇబ్బంది పడుతున్నామని, ఇప్పటికైనా తమను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు గిరిజన సంఘాల నాయకులు కమిషన్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. సుమారుగా 40 లక్షల మందికి పైగా గిరిజనులు వెనుకబాటుతో ఉన్నారని వారి కోసం అనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఇంకా వారు పేదరికంతోనే మగ్గుతున్నారన్నారు. ఇలాంటి సమయంలో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరిస్తే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం అందరి అభిప్రాయాలను సేకరిస్తున్నామని నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ఏకసభ్య కమిషన్ సభ్యులు శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు.
' రాష్ట్రంలోని బోయ, వాల్మీకుల స్థితిగతుల మీద వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటాం. వారు వెల్లడించిన అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా. ఆయా వర్గాల వారి సమస్యలను గవర్నమెంట్‌కు తెలియజేస్తా.'- శామ్యూల్ ఆనంద్ కుమార్
ఇవీ చదవండి: