TDP Leaders Pujas About Chandrababu in AP: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టారు. వైసీపీ సర్కారు రాజకీయ కక్షతోనే తమ నేతపై అక్రమ కేసులు బనాయిస్తోందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ప్రతిరోజు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపడుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో విడుదల కావాలని కోరుకుంటూ.. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గడేహోతూరు శివాలయంలో ఆ పార్టీ శ్రేణులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 101 టెంకాయలను కొట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'సైకో పోవాలి..సైకిల్ రావాలి' అంటూ నినాదాలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు అనంతపురంలో టీడీపీ నాయకులు మసీదులో ప్రార్థనలు నిర్వహించారు. 36వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రాజారాం ఆధ్వర్యంలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని దువా చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా ఆరోగ్యంతో బయటికి రావాలని దేవుడిని కోరుకున్నట్లు టీడీపీ ముస్లిం నేతలు తెలిపారు.
స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టులను నిరసిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ ముందు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో చేతులకు సంకెళ్లు వేసుకొని సోమవారం వినూత్న నిరసన చేపట్టారు. చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన రోజు నుంచి నిరంతరంగా ఒక్కోరోజు ఒక్కో విధంగా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ ముందు నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా తాజాగా ఇంచార్జ్ ఉమాతో పాటు పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు చేతులకు సంకెళ్లు వేసుకొని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చంద్రబాబు నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ.. ఇలాంటి అక్రమ కేసులతో తమ పార్టీ కేడర్‌ను నైతికంగా దెబ్బతీయలేదని తాము ఎన్నడూ పార్టీకి విధేయులుగా ఉంటూ పార్టీ శ్రేయస్సు కోసం నిరంతరం పని చేస్తామని పేర్కొన్నారు. వైసీపీ సర్కారు ఎన్ని కుట్రలు పన్నినా తమ నేత కడిగిన ముత్యములా బయటకు వస్తారని అన్నారు.
రాష్ట్రంలో సీఎం జగన్ రాక్షస పాలన సాగిస్తూ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై కక్షపూరితంగా కేసులు పెట్టారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. మచ్చలేని నాయకుడిగా చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అధినేత అరెస్టును ఖండిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు దీక్షలు, ప్రత్యేక పూజలు, కాగడాల ర్యాలీలను కొనసాగించారు.