అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామంలో మంగళవారం మొహరం నేపథ్యంలో.. ఇరు వర్గాలకు చెందిన పలువురు ఘర్షణ పడ్డారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. లోకేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విడిపించుకోవడానికి వెళ్లిన తెదేపా నాయకులను పోలీస్ స్టేషన్లో ఉంచారు. వైకాపాకు చెందిన ఓ నేత.. ఇదే ఘటనపై ప్రత్యర్థులపై ఫిర్యాదు చేశారు. అనంతరం.. గుమ్మగట్ట ఎస్సై నాగన్న, కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డిలు కలిసి తెదేపాకు చెందిన లోకేష్, తిప్పయ్య, రుద్రప్పలను లాఠీతో చితకబాదినట్టు ఆ పార్టీ నేతలు ఆరోపించారు. బాధితులు రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాల ముందు ఆందోళన చేశారు. ఆర్అండ్బీ రహదారిపై ధర్నాకు దిగారు. మూడు గంటలు పాటు రాయదుర్గం పట్టణంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం ప్రభుత్వాస్పత్రి సందర్శించి బాధితులను పరామర్శించారు. పోలీసుల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. అనంతరం బేలోడు ప్రాంతానికి చెందిన ఇరువర్గాలు.. రాళ్లతో ఘర్షణకు దిగాయి. కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో వారిని పోలీసులు చెదరగొట్టారు.
ఇదీ చదవండి: