ఆస్తికి అడ్డుగా ఉన్నాడన్న ఆలోచనతో.. బావనే హతమార్చాలని మరదలు కుట్ర పన్నింది. బయటి వ్యక్తులకు డబ్బులిచ్చి హత్యాయత్నం చేయించింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం పోలేవాండ్లపల్లిలో కలకలం సృష్టించింది. ఈనెల 5న జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తిపై జరిగిన హత్యాయత్నం కేసును నల్లచెరువు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులను కదిరికి సమీపంలోని కౌలేపల్లి రైల్వే గేటు వద్ద అరెస్టు చేశారు. సోమవారం నల్లచెరువులో ఏర్పాటు చేసిన సమావేశంలో కదిరి గ్రామీణ సీఐ మధు.. ఈ హత్యా యత్నం ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
కదిరి పట్టణానికి చెందిన భాగ్యలక్ష్మికి నల్లచెరువు మండలం పోలేవాండ్లపల్లికి చెందిన రంజిత్ కుమార్ రెడ్డితో వివాహమైంది. తనకున్న చెడు అలవాట్లకు బావ జగన్ మోహన్ రెడ్డి అడ్డుగా ఉన్నాడని భావించింది. అతడిని చంపితే ఆస్తి అంతా తనకే దక్కుతుందని కుట్ర పన్నింది. కదిరి పట్టణానికి చెందిన జిలాన్, అతిక్, డేవిడ్‌లకు 1.50 లక్షల రూపాయలు ఇచ్చి బావను చంపించేలా పథకం రచించింది.
ఇందులో భాగంగా... ఈనెల 4న భాగ్యలక్ష్మి కదిరి నుంచి పోలేవాండ్లపల్లికి వచ్చింది. రాత్రి నిద్ర మాత్రలు కలిపిన కూల్ డ్రింక్‌ను జగన్ మోహన్ రెడ్డి తాగేలా చేసింది. తెల్లవారుజామున 4 గంటలకు ఆయనను చంపేందుకు అతిక్, డేవిడ్‌లను కాల్ చేసి పిలిపించింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి కత్తితో మెడ, గొంతు మీద పొడవగా.. అతనికి మెలకువ వచ్చి గట్టిగా అరిచాడు. భయపడిన అతిక్, డేవిడ్.. అక్కడి నుంచి పారిపోయారు. కదిరికి చేరుకుని జరిగిన విషయాన్ని జిలాన్ అనే వ్యక్తికి తెలిపారు. దర్యాప్తు చేపట్టిన ఎస్సై మునీర్ అహమ్మద్, సిబ్బంది చాకచక్యంగా నిందితులు భాగ్యలక్ష్మి, మహమ్మద్ అతిక్, జిలాన్‌బాషా, డేవిడ్‌ను అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు. వారి నుంచి కత్తి, ద్విచక్ర వాహనంతో పాటు మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి:
ప్రభుత్వ ఉద్యోగులపేరుతో మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ అరెస్టు