అనంతపురం జిల్లా బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తల్లి మృతదేహంతో కుమార్తెలు ఆందోళన చేశారు. జలాలపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు లక్ష్మీదేవమ్మ మరణించగా.. మృతదేహాన్ని బంధువులు తహసీల్దార్ టేబుల్‌పై ఉంచి నిరసన చేపట్టారు. ఏడేళ్ల క్రితం లక్ష్మీదేవమ్మ భర్త పెద్దన్న చనిపోయారు. పెద్దన్నపేరుతో బత్తలపల్లి జలాలపురం గ్రామంలో.. సర్వే నెంబర్.18.బి.లో 19 ఎకరాల 20 సెంట్ల భూమి ఉంది. దాన్ని తన పేరు మీదకి మార్చాలని లక్ష్మీదేవమ్మ.. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగారని మృతురాలి కుమార్తెలు..రత్నమ్మ, నాగేంద్రమ్మ, లింగమ్మ తెలిపారు.
భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలు ఇవ్వకుండా తన తల్లిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు వారు చెప్పారు. ఆన్లైన్లో తన తండ్రి పేరు మీదే పొలం ఉన్నట్లు రికార్డులు ఉన్నాయని, అయితే తన తండ్రి చనిపోవడంతో.. పేపర్ రికార్డులు తమతో లేవన్నారు. దీనిపై ఆర్డీవోను సంప్రదించగా.. పాసు పుస్తకాలను ఇవ్వాలని లేఖ ద్వారా తహసీల్దార్‌కు అందించామన్నారు. అయినప్పటికీ తహసీల్దార్ స్పందించకపోవడంతో తన తల్లి అనారోగ్యానికి గురైందని మృతురాలి కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆస్తికి సంబంధించి పాసుపుస్తకాలు రావని ఆలోచనతోనే.. మానసికంగా కుంగిపోతూ తమ తల్లి మృతి చెందిందని వారు ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ పొలానికి పాస్ పుస్తకం ఇవ్వాలని కోరారు.
బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్దకు లక్ష్మీదేవమ్మ మృతదేహాన్ని ఆంబులెన్స్‌లో తీసుకువచ్చి ధర్నా చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని.. మృతురాలి కుటుంబ సభ్యులకు సర్దిచెప్ప చెప్పడంతో ధర్నా విరమించారు.
ఇదీ చదవండి: MURDER: లాడ్జిలో ఒంగోలు యువతి హత్య.. ప్రియుడి పనేనా?