జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కౌలు రైతుల భరోసా యాత్రను మంగళవారం ప్రారంభించనున్నారు. అనంతపురం జిల్లాలో కొత్త చెరువు నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయం అందిస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
ఏయే జిల్లాల్లో ఎంత మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే వివరాలను జనసేన యంత్రాంగం ప్రభుత్వం నుంచి సమాచార హక్కు చట్టం కింద సేకరించింది. ఆ సమాచారం ప్రకారమే ఆయా జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్ కలుసుకోనున్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఎంతో కొంత సాయం చేయాలనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానంటూ.. ఇందుకు తన వంతు సాయంగా ఆయన రూ.5 కోట్లు పార్టీకి విరాళం ప్రకటించారు.
పవన్ మంగళవారం ఉదయం 9 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మండల కేంద్రమైన కొత్త చెరువు వెళ్తారు. అక్కడ బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి సాయం అందించి ఆ తర్వాత ధర్మవరం మండలంలోని గొట్లూరు గ్రామం చేరుకుంటారు. తర్వాత అనంతపురం రూరల్ మండలం పూలకుంట, మన్నీల గ్రామాలను చేరుకుంటారు. ఈ అన్ని చోట్ల ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పరామర్శల తర్వాత మన్నీల గ్రామంలో రచ్చబండ నిర్వహిస్తారు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న మరికొందరు కౌలు రైతుల కుటుంబాలకు ఇక్కడ ఆర్థిక సాయం అందించి వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకుంటారు. జ్యోతిరావు పూలే మార్గం అనుసరణీయమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. పూలే జయంతి సందర్భంగా సోమవారం ఆయనకు నివాళులు అర్పించారు. ‘‘అస్పృశ్యత నిర్మూలన, సామాజిక న్యాయం, మహిళా సాధికారిత కోసం నిరంతరం శ్రమించిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల కోసం, స్త్రీ విద్య కోసం చిత్తశుద్ధితో ముందుకు వెళ్లిన ఆయన మార్గం అనుసరణీయం’’ అని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆ కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం.. త్వరలోనే వారిని పరామర్శిస్తా: పవన్