ధర్మవరంలో కేతిరెడ్డి గుడ్మార్నింగ్ ఓ డ్రామా అని, మాజీఎమ్మెల్యే తప్పుడు ప్రచారంతో మభ్యపెడుతున్నారని... తెదేపా యువనేత పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. తెదేపా పరిషత్ ఎన్నికలను బహిష్కరించడం ద్వారా వైకాపా ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను దేశం మొత్తం తెలిసేలా చంద్రబాబు చేశారని వివరించారు. ఇది వెనకడుగు వేసినట్లు కాదన్న విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలని సూచించారు.
ధర్మవరం బాధ్యతలను తనకు చంద్రబాబు అప్పగించాక... అక్కడ అడుగుపెట్టిన రోజునుంచే వైకాపాపై, ఆపార్టీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డిపై యుద్ధం ప్రకటించానని వ్యాఖ్యానించారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఎంతో మంది కార్యకర్తలు నామినేషన్లు వేశారని... వారందరినీ గుర్తుపెట్టుకుంటానని శ్రీరామ్ పేర్కొన్నారు. ధర్మవరంలో కార్యకర్తలు సైనికుల్లా నిలిచారని కొనియాడారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిని గుర్తుపెట్టుకుంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
గ్రామాల్లోకి వెళ్లినప్పుడు అక్కడి సమస్యలు తీర్చడం మాట అలా ఉంచితే మైకు సరిపోయిందా..? కెమెరా పొజిషన్ సరిగ్గా ఉందా..? ఫేస్ బుక్లో కనిపిస్తున్నానా..? అనే వాటిపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డిని ఉద్దేశించి శ్రీరామ్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేకు అన్ని ఎకరాల భూములు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరిపైన ఘాటుగానే స్పందించారు. తప్పుడు ప్రచారం చేయడంలో ఆయన దిట్టని పేర్కొన్నారు.
ధర్మవరంలో తెదేపా జెండా ఎగరేయడం ఖాయమని, అందుకోసం ప్రతికార్యకర్త సైనికుడిలా పనిచేయాలని శ్రీరామ్ పిలుపునిచ్చారు. చంద్రబాబు ఇచ్చిన బాధ్యతను శ్రేణుల సహకారంతో నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... శ్రీవారి ఆలయ నిర్మాణానికి జమ్మూలో 62 ఎకరాలు మంజూరు