వృద్ధాప్యంలో ఉన్న ఆ దంపతులను అనారోగ్యం వెంటాడింది. ఉన్న ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి పంపించేశారు. చివరి రోజుల్లో ఇద్దరికీ ఉన్న జబ్బులు వారిని కుంగదీశాయి. దీంతో ఇక ఎవరికీ భారం కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. అనంతపురం జిల్లాలో చెన్నేకొత్తపల్లి మండలంలోని హర్యాన్ చెరువు గ్రామంలో జరిగిన ఈ సంఘటన విషాదాన్ని నింపింది.
హర్యాన్ చెరువు గ్రామానికి చెందిన సుధాకర్, రామలీలా అనే వృద్ధ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారు పెళ్లిళ్లై ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. కొంత కాలంగా సుధాకర్ వెన్నెముక నొప్పితో బాధపడుతుండటంతో... బెంగళూరులో ఉంటున్న కుటుంబ సభ్యుల సహకారంతో ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ విఫలం కావడంతో నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. దీనికి తోడు సుధాకర్ భార్య రామలీల కూడా గుండెజబ్బుతో బాధపడుతుంది. ఆమెకు కంటి చూపు కూడా మందగించడంతో వృద్ధ దంపతులు మనస్థాపానికి గురయ్యారు.
ఇలా అనారోగ్యంతో బతుకు సాగించి... పిల్లలకు భారంగా ఉండలేమని భావించి... ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా.. సూసైడ్ లెటర్ లభించింది. కేసు నమోదు చేశారు.
"నాకు సర్జరీ ఫెయిల్ అయ్యింది. మళ్లీ మూడు నెలలకు ఆసుపత్రికి రమ్మనారు. నా భార్యకు కూడా గుండెజబ్బు వచ్చింది. మాకు ఎవ్వరిని ఇబ్బంది పెట్టటం ఇష్టంలేక వెళ్లిపోతున్నాం. మా పిల్లలు వారి వద్దకు రమ్మనారు. కానీ, వారిని ఇబ్బంది పెట్టటం ఇష్టంలేదు. మా చావుకి ఊరు, పిల్లలు ఎవ్వరూ కారణం కాదు... " అని వృద్ధ దంపతులు రాసిన సూసైడ్ లెటర్ అందరిని కంటతడి పెట్టిస్తోంది.
ఇదీ చదవండి: