అనంతపురం జిల్లా రాయదుర్గం పురపాలక సంఘం భవనానికి వాస్తు దోషం ఉందని నూతన పాలకవర్గం భావించినట్లు తెలుస్తోంది. సరిచేయకపోతే నష్టం జరిగే అవకాశముందని.. తొలి సమావేశంలో రూ. 2లక్షల నిధులను మరమ్మతులకు కేటాయించారన్న మాట.. వినిపిస్తోంది. భవనానికి వెనుకవైపు ప్రహరీ నిర్మాణం, కమిషనర్ చాంబర్‌లో మరుగుదొడ్డి ఏర్పాటు వంటివాటితో దోషాన్ని నివారించవచ్చన్న సలహాలతో పనులు చేపట్టేందుకు నిమగ్నమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవనం కట్టినప్పటి నుంచి ఏదో ఒక అరిష్టం జరుగుతోందని పాత సంఘటనలన్నీ నెమరువేసుకుంటూ వాస్తుకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిసింది. మొత్తానికి కారణం ఏదైనా... ఇప్పటికే సమావేశాన్ని నిర్వహించి మరీ.. భవనం మరమ్మతులకైతే రూ. రెండు లక్షలు కేటాయించారు.
గత అనుభవాలతో...
ఇప్పటివరకు పరిపాలన పరంగా కౌన్సిల్‌లో రెండు విడతలుగా కొత్త పాలకవర్గం ఆ భవనంలో ఏర్పడింది. గతంలో ఉన్న పాలకవర్గం హయాంలో వాస్తు దోషం కారణంగానే ముగ్గురు అధికారులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని భావిస్తున్నారు. 2014 మున్సిపల్ ఎన్నికలు నిర్వహించినప్పుడు రోడ్డు ప్రమాదంలో తెదేపా ప్రకటించిన ఛైర్మన్ అభ్యర్థి ముదిగల్లు రాము చనిపోయిన సంఘటనను వాస్తుకు కారణంగా చూపిస్తున్నారు.
ప్రస్తుతం చైర్మన్‌గా ఎన్నికైన పొరాళ్లు శిల్ప సైతం ఎన్నికలకు ముందే భర్త సీతారామ్‌ను పోగొట్టుకోవటం లాంటివన్నీ బేరీజు వేసి వాస్తుదోషాన్ని సరి చేయాలని భావించినట్లు ప్రజల్లో చర్చ జరుగుతోంది. గోడ నిర్మాణంతో పాలన సాఫీగా సాగుతుందనే నమ్మకంతో పాటు ఇలాంటి సంఘటనలు పునారావృతంకావనే విశ్వాసంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో వాస్తు కోసం రూ. రెండు లక్షలు కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ జబ్బార్‌మియాను అడిగితే పరిపాలనా సౌలభ్యం కోసం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
తీవ్రంగా ఖండిస్తున్నాం..
వాస్తు దోషం పేరుతో రూ.2 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసం అని సీఐటీయూ తాలూకా అధ్యక్షులు మల్లికార్జున ప్రశ్నించారు. పట్టణాభివృద్ధికి కోసం వినియోగించాల్సిన నిధులను దోషం పేరుతో ఖర్చు చేయాడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
ఇదీ చూడండి: