అనంతపురం జిల్లా కదిరి తూర్పు, పడమర ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని మూడు ప్రాంతాల్లో వేలాది లీటర్ల పాల ప్యాకెట్లను రోడ్డుపక్కన, నీటికుంటల్లో పడేశారు. మూడు ప్రదేశాల్లో పాల ప్యాకెట్లు పడేసిన విషయమై ఈనాడు-ఈటీవి భారత్లో కథనాలు రావడంతో గుత్తేదారులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు.
కదిరికి సమీపంలోని గజ్జలరెడ్డిపల్లి వద్ద దాదాపు 2వేల లీటర్లకు పైగా పాల ప్యాకెట్లను పడేశారు. ఈనాడులో వార్త ప్రచురితం కావడంతో గుత్తేదారులు తెల్లవారుజామునే అక్కడికి చేరుకుని పాల ప్యాకెట్లను గోతి తీసి అందులో పాతిపెట్టేశారు. ఆ ప్రదేశాన్ని వ్యర్థాలతో పూడ్చేశారు.
స్థానికుల ఫిర్యాదు, ఉన్నతాధికారుల ఆదేశంతో ఐసీడీఎస్ అధికారులు విచారణ ప్రారంభించారు. విచారణకు వెళ్లిన అధికారులు అక్కడేమీలేవన్నట్లుగా వ్యవహరించారు. గుత్తేదారులు చేసిన పనిని స్థానికులు అధికారులకు వివరించారు. వెంటనే సీడీపీవో షాజిదాబేగమ్, ఇతర అధికారులు జేసీబీ సాయంతో పాల ప్యాకెట్లు పాతిపెట్టిన గుంతను తవ్వించారు. మరో 60రోజులు గడువు ఉన్న పాల ప్యాకెట్లను పాతిపెట్టినట్లు విచారణలో తేలింది.
కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని కుంటలో పాల ప్యాకెట్లు పడేసినట్లు సమాచారం అందడంతో ఐసీడీఎస్ అధికారులు అక్కడికి చేరుకుని వందల సంఖ్యలో ప్యాకెట్లను గుర్తించారు. అంగన్వాడి కేంద్రాల్లో లబ్ధిదారులకు పాల ప్యాకెట్లను అందజేసినట్లు రికార్డుల్లో నమోదయ్యాయని, ఇక్కడ పడేసిన పాల ప్యాకెట్లు ఎక్కడివనే వివరాలు తేలాల్సి ఉందన్నారు. గుత్తేదారుల గోదాములను పరిశీలించి సమగ్ర దర్యాప్తు చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: