Nara Lokesh Interaction With Working Professionals: వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా దిశగా పయనిస్తోందని... తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. మళ్లీ టీడీపీ గెలిచిన తర్వాత అన్ని రంగాల్లో ఏపీని మొదటి స్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 65వ రోజు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర జోరుగా సాగింది. యాత్రలో వివిధ రైతులతో మాట్లాడిన లోకేశ్.... వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర... అనంతపురం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగింది. 65వ రోజు పాదయాత్రను జంబులదిన్నె విడిదికేంద్రం నుంచి... యువనేత ప్రారంభించారు. భారీ సంఖ్యలో స్థానికులు, టీడీపీ కార్యకర్తలు యాత్రలో పాల్గొని లోకేశ్‌కు మద్దతుగా నడిచారు. వివిధ వర్గాల సమస్యల్ని తెలుసుకుంటూ లోకేశ్ ముందుకు కదిలారు. నడక ప్రారంభానికి ముందు... జంబులదిన్నె విడిదికేంద్రం వద్ద వర్కింగ్ ప్రొఫెషనల్స్‌లో ముఖాముఖి నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సీపీఎస్. రద్దు విధానంపై ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుందామని భరోసా ఇచ్చారు.
పాదయాత్రలో భాగంగా శింగనమల మండలం నర్సాపురంలో రైతులతో లోకేశ్ మాట్లాడారు. వాతావరణం అనుకూలించక భారీగా నష్టపోయామని వేరుశనగ రైతులు వాపోయారు. మూడేళ్లగా ఎరువులు, విత్తనాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని... మద్దతు ధర కూడా లభించడంలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో బిందు సేద్యానికి.. యంత్రాలను 90శాతం రాయితీతో ఇచ్చామని జగన్ సర్కార్ రైతుకు మొండిచేయి చూపిందని మండిపడ్డారు.
'ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతుల కల్పన కోసం కృషి చేస్తాం. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేందుకు కృషి చేస్తాం. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ముందు ఉంచేందుకు కృషి చేయడమే మా లక్ష్యం. ప్రధానంగా విద్య, వైద్యంపై కృషి చేస్తే బలంగా నిలబడుతాం. అనేది ప్రతి ఒక్కరికి సమానంగా అందేలా చేస్తాం. అభివృద్దిపై ప్రణాళిక చేపట్టాం. పక్క రాష్ట్రంలో పని చేస్తున్న యువతను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం.'- తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్
లోకేష్ పాదయాత్రపై సీపీఐ ప్రశంసలు: అనంతపురం జిల్లా గుంతకల్లులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆధరణ లభించిందన్నారు. రైతుల కష్టాలు, పేదల ఇబ్బందులు తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. లోకేశ్ వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలు గురించి మాట్లాడటం ప్రజల్లో చర్చనీయాంశంగా మారిందన్నారు. జగన్ ఎమ్మెల్యేలను మేనేజ్ చేయడం చేత కాదని జగదీష్ విమర్శించారు.
ఇవీ చదవండి: