దేశవ్యాప్త లాక్‌డౌన్ రాష్ట్రంలోని రైతులను తీవ్రంగా దెబ్బ తీసింది. త్వరగా పాడయ్యే స్వభావమున్న ఉద్యాన ఉత్పత్తులు చాలావరకు తోటల్లోనే కుళ్లిపోయాయి. అరటి, బత్తాయి, ద్రాక్ష పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఇటీవల కాలం వరకు పంటల్ని మార్కెట్‌కు తరలించే అవకాశం లేక ఇబ్బంది పడిన ఉద్యాన రైతులు, ఇపుడు సడలింపులతో ఒక్కసారిగా తీసుకొస్తున్నారు. అయితే వారం పాటు దిల్లీ, కోల్‌కతాకు బత్తాయి ఎగుమతి చేసిన వ్యాపారులు ఇప్పుడు అక్కడ కరోనా ప్రభావంతో వ్యాపారం ఆగిపోవడంతో ఏమీ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం చిన్నాచితకా అమ్మకాలే జరుగుతుండటంతో ధరలు అమాంతం పడిపోయాయి.
మొన్నటి వరకు 12 వేల నుంచి 14 వేలు పలికిన టన్ను బత్తాయి ధర ఇప్పుడు 10 వేల నుంచి 7 వేలకు పడిపోయింది. దీనివల్ల పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యాపారుల సమస్యలు ఇంకో రకంగా ఉన్నాయి. ఉత్తరాదికి బత్తాయి పంపినా కచ్చితంగా డబ్బు వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు. లాక్‌డౌన్ ఎత్తేవేసే వరకు చేయగలిగిందేమీ లేదని చెబుతున్నారు. బత్తాయి తినేవారి సంఖ్య చాలా తక్కువ. జ్యూస్ కోసమే అధికంగా వినియోగిస్తారు. అయితే లాక్‌డౌన్‌తో జ్యూస్ బండ్లకు అనుమతిలేకపోవడం బత్తాయి డిమాండ్ పడిపోవడానికి కారణమైంది.
ఇవీ చదవండి