అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎమ్మార్పీఎస్ నాయకులు తప్పుపట్టారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఒక దళిత కలెక్టర్‌ను హేళన చేసి మాట్లాడడం సరికాదంటూ వారు మండిపడ్డారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా.. నార్పల మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టారు.
కలెక్టర్ పై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా అనంతపురంలోని టవర్ క్లాక్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సప్తగిరి సర్కిల్ వద్ద నిరసన చేశారు.
జాతరకు లా అండ్ ఆర్డర్ సమస్య :
తాడిమరి మండలం చీలవారిపల్లిలో 13వ తేదీన జరిగిన దేవస్థాన జాతరకు లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని కలెక్టర్ జాతరను రద్దు చేశారన్నారు. జాతర జరగలేదని బాల్ రెడ్డి అనే వ్యక్తి మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడని.. జాతర నిర్వహణకు అనుమతిస్తే ఏం సమస్య ఉండేదంటూ కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సమస్య ఉన్నందువల్లే కలెక్టర్ జాతరను రద్దు చేశారని నాయకులు అన్నారు.
ఈ విషయం ఆలోచించకుండా జిల్లా ప్రథమ పౌరుడైన కలెక్టర్‌పై వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఎమ్మెల్యే పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని నాయకులు హెచ్చరించారు. త్వరలోనే కేతిరెడ్డి హౌస్ అనే కార్యక్రమంతో వేలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఐక్యంగా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: