MLA Balakrishna deeksha: సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ఏర్పాటు చేయాలంటూ.. స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ఆందోళన నిర్వహించారు. హిందూపురంలో పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి ర్యాలీగా తరలివెళ్లిన బాలకృష్ణ.. అంబేడ్కర్ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు. బాలకృష్ణ వెంట భారీగా పార్టీ శ్రేణులతోపాటు అఖిలపక్ష సభ్యులు , విద్యార్థులు, యువకులు తరలివచ్చారు. పార్టీలకు అతీతంగా బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ నినదించారు.
ఎన్‌టీఆర్ పేరుతో జిల్లా కేంద్రం ప్రకటించి అభిమానం ఉన్నట్లు చెబుతున్న జగన్.. అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసేశారని బాలకృష్ణ ప్రశ్నించారు. రాత్రికి రాత్రి జిల్లాలు ప్రకటించి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం జిల్లా కేంద్రం సాధించేందుకు అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని బాలకృష్ణ ప్రకటించారు. హిందూపురంలో అన్ని వసతులు ఉన్నాయన్న ఆయన..జిల్లా కేంద్రం సాధన కోసం ఎంతవరకైనా పోరాడతానని స్పష్టం చేశారు. మన ప్రాంతం, మన రాష్ట్రం బాగుండాలనేదే తన కోరికన్న బాలకృష్ణ.. అవసరమైతే పుట్టపర్తిలోనూ ఆందోళన చేస్తామన్నారు.
అంతకముందు హిందూపురంలోని బాలకృష్ణ ఇంటి వద్ద కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది. తన ఇంటి వద్ద ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను బాలకృష్ణ ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: