Ponnavolu Son Granite Lease Issue : వైఎస్సార్సీపీ పాలనలో మైనింగ్ లీజుల కోసం వేల అర్జీలు పెండింగ్‌లో ఉన్నా గనుల శాఖ అధికారులు పట్టించుకోలేదు. కానీ అప్పట్లో ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా (ఏజీపీ)గా పనిచేసిన పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కుమారుడి గ్రానైట్ లీజు దస్త్రాన్ని మాత్రం వేగంగా పరుగులు పెట్టించారు. దరఖాస్తు అందిన వెంటనే స్థానిక అధికారి నుంచి గనుల శాఖ డైరెక్టర్ వరకూ ప్రతి స్థాయిలోనూ ఆఘమేఘాలపై స్పందించి అనుమతులు జారీచేశారు.
శ్రీకాకుళం జిల్లాలోని గ్రానైట్ క్వారీలపై సుధాకర్‌రెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి కన్నేశారు. ఈ క్రమంలో గనుల ఘనుడు వెంకటరెడ్డి సంచాలకునిగా ఉన్న సమయంలో వాటిని సులువుగా చేజిక్కించుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. నందిగం మండలం సొంటినూరులోని సర్వేనంబర్ 1లో 4.920 హెక్టార్లలో కలర్ గ్రానైట్ (శ్రీకాకుళం బ్లూ వెరైటీ) లీజు కేటాయించాలని కార్తీక్‌రెడ్డి 2021 ఏప్రిల్ 30న టెక్కలి గనుల శాఖ ఏడీకి దరఖాస్తు చేసుకున్నారు. దీనికి తహసీల్దార్ వెంటనే నిరభ్యంతరపత్రం జారీచేశారు. ఆ తర్వాత 39 రోజుల్లోనే అంటే జూన్ 8న అక్కడ 2.963 హెక్టార్లలో లీజు కేటాయింపునకు సిఫార్సు చేస్తూ మైనింగ్ ఏడీ ఆ దస్త్రాన్ని సంచాలకునికి పంపారు. అనంతరం అన్ని పనులూ వేగంగా పూర్తయి, 20 సంవత్సరాల కాలానికి లీజు దక్కింది.
చకచకా అనుమతుల జారీ : టెక్కలి ఏడీ నుంచి వచ్చిన అర్జీని గనులశాఖ సంచాలకుడి కార్యాలయం పరిశీలించి లీజు కేటాయింపునకు ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. దీంతో 2021 జులై 13న ఏడీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌వోఐ) అధికారులు జారీచేశారు. అంటే కార్తీక్‌రెడ్డి దరఖాస్తు చేసిన 78 రోజుల్లోనే లీజు కేటాయింపునకు మొగ్గుచూపుతున్నట్లు ప్రాథమికంగా ఆమోదం తెలిపారు. తర్వాత వివిధ శాఖల అనుమతులన్నీ చకచకా వచ్చేశాయి. అదే సంవత్సరం అక్టోబర్ 12న మైనింగ్ ప్లాన్ అందజేశారు.
- 2022 జనవరి 6న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నుంచి పర్యావరణ అనుమతి (ఈసీ) పొందారు.
- ఫిబ్రవరి 2న విశాఖపట్నంలోని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సీఎఫ్‌ఈ) ఇచ్చారు.
- అనుమతులన్నీ వచ్చేయడంతో 2022 మార్చి 30న లీజు మంజూరు చేస్తూ గనులశాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అంటే అర్జీ చేసిన 11 నెలల్లో లీజు మంజూరు చేశారు.
ఈ-వేలమంటూ పక్కన పెట్టారు : 2019లో జగన్ సర్కార్ వచ్చాక ఈ-వేలం విధానంలో లీజులు కేటాయిస్తామంటూ అప్పటికే అర్జీ చేసుకొని ఎదురుచూస్తున్న వారందరికీ మొండిచేయి చూపారు. ఇలా రాష్ట్రమంతా 6000ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కేవలం టెక్కలి ఏడీ కార్యాలయ పరిధిలోనే గ్రానైట్ లీజుల కోసం 600 అర్జీలు అందగా, అవన్నీ పక్కనపెట్టారు. గ్రానైట్ లీజులకు ప్రాథమిక ఆమోదం తెలిపి, అన్ని అనుమతులు పొందిన దరఖాస్తులు 200 వరకు 2019 నాటికే పెండింగ్‌లో ఉన్నాయి. వీటినీ పట్టించుకోలేదు. పొన్నవోలు కార్తీక్‌రెడ్డి వంటివాళ్లు 2021లో దరఖాస్తు చేసుకోగా, ఏడాదిలోనే లీజులు కేటాయించేశారు. వైఎస్సార్సీపీ పెద్దలకు కావాల్సిన వారికి మాత్రం ఈ-వేలం విధానం అమల్లోకి రావడానికి ముందే పాత విధానంలో లీజులు కేటాయించారు.
మదనపల్లెలోనూ అడ్డగోలుగా : కార్తీక్‌రెడ్డికి అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోనూ గ్రానైట్ లీజును అడ్డగోలుగా కేటాయించారు. బండకిందపల్లెలోని 2 హెక్టార్లలో కలర్ గ్రానైట్ లీజు కోసం షాన్వాజ్ రేష్మా నవాజ్ అనే మహిళ గతంలో దరఖాస్తు చేసుకున్నారు. అది పెండింగ్‌లో ఉండగానే, అదే లీజు కోసం కార్తీక్‌రెడ్డి అర్జీ చేశారు. ఈ-వేలానికి ముందు, మొదట దరఖాస్తు చేసుకున్న వారికి తొలుత కేటాయింపు అనే విధానం ఉండేది. దాన్ని పట్టించుకోకుండా 2 హెక్టార్లలో కార్తీక్‌రెడ్డికి లీజు కేటాయిస్తూ వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పాత దరఖాస్తుదారు హైకోర్టును ఆశ్రయించినా సరే, పట్టించుకోలేదు.
ప్రభుత్వ భూమిలో గ'లీజు' దందా- భారీగా పెనాల్టీ - YSRCP Leader Quarry Seized