అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలపై ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో వారం రోజులుగా రోగుల పట్ల నిర్లక్ష్యం చూపుతున్న వైనంపై ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడులు కోవిడ్ వార్డులను పరిశీలించి, వైద్యులతో రెండు గంటలపాటు సమావేశం నిర్వహించారు.
డిగ్రీలు పొందిన డాక్టర్లు రోగుల పట్ల కనీస మానవత్వం చూపాలని ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి చెప్పారు. కొందరు ప్రభుత్వ వైద్యులు ఆసుపత్రికే రాకుండా వాట్సాప్ ద్వారా రోగులు వాడాల్సిన మందుల వివరాలను నర్సులకు పంపుతుండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలే భయాందోళనతో ఉన్న కరోనా రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే ఇక మీదట ఉపేక్షించేదే లేదని, అవసరమైతే వారు వైద్య వృత్తికే అనర్హులుగా చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో అంతా బాగుందని, కరోనా రోగులకు చక్కటి సేవలు అందుతున్నాయని కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు. ఎక్కువ సంఖ్యలో వస్తున్న సందర్భంలో చిన్న చిన్న సంఘటనలు జరగటం సాధారణమేనని కలెక్టర్ చెప్పుకొచ్చారు.