వారంతా ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని కొన్ని నెలల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లా నుంచి బెంగళూరు చేరారు. అక్కడ భవన నిర్మాణ పనులకు వెళ్తూ పొట్ట నింపుకొన్నారు. కరోనా ప్రభావం వల్ల గడిచిన 50 రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించాయి. ఈ కూలీలంతా ఎటూ వెళ్లలేక బెంగళూరులోనే చిక్కుకుపోయారు. ఎటూ కదల్లేని పరిస్థితుల్లో 50 రోజుల పాటు అక్కడే గడిపారు. లాక్డౌన్ ఎప్పుడూ తొలగిస్తారో తెలియని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు.. ఎలాగైనా తమ స్వగ్రామాలకు చేరుకోవాలని బెంగళూరులో దృఢంగా నిశ్చయించుకున్నారు.
శనివారం బెంగళూరులో 30 మంది వలస కార్మికులు సైకిళ్లను కొనుగోలు చేశారు. సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరంలోని తమ స్వగ్రామాలకు పయనమయ్యారు. ఒక్కో సైకిల్‌కు 6000 వెచ్చించారు. కొందరు ఒక్కో సైకిల్‌పై ఇద్దరు బయలుదేరారు. శనివారం రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరి ఆదివారం ఉదయానికి 150 కిలోమీటర్లు ప్రయాణించి పెనుకొండ మండలంలోకి ప్రవేశించారు. ఎలాగైనా ప్రాణం పోయే లోపు స్వగ్రామాలకు చేరుకుని కుటుంబ సభ్యులను కలుసుకోవాలని ఆరాటంతో వారంతా బయల్దేరినట్టు చెప్పారు. ఆదివారం ఉదయం పెనుకొండ మండలంలోని హరిపురం వద్ద దాహం తీర్చుకుని ప్రయాణం సాగించారు.
ఇదీ చదవండి: