అనంతపురం జిల్లా గుత్తి గేట్స్ కళాశాలలోని క్వారంటైన్ కేంద్రంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన వలసకూలీలు ఉన్నారు. కేంద్రీయ విద్యాలయంలోని కేంద్రంలో నెల్లూరు వాసులు 20 మంది ఉన్నారు. 40 రోజులుగా వీరు ఇక్కడే ఉన్నారు. కరోనా నెగెటివ్ వచ్చినా స్వస్థలాలకు పంపకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి తిండి లేక తమ కుటుంబాలు పస్తులుంటున్నాయని.. తమను వెంటనే స్వస్థలాలకు పంపాలని కోరుతూ నిరసన తెలపగా.. ఆదివారం కొందరిని పంపారు.
అనుమతిలో జాప్యం
ఉపాధి నిమిత్తం అనంతపురం జిల్లాకు వచ్చి చిక్కుకుపోయిన పొరుగు జిల్లాలు, రాష్ట్రాల వారు స్పందన పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఇందులో నమోదు చేసుకోవడంపై అవగాహన లేని వారు.. తహసీల్దార్ కార్యాలయంలో లేదా గ్రామ సచివాలయాల్లో సంప్రదించినా చాలు. ఈ తతంగం అంతా డీఆర్‌డీఏ విభాగం పర్యవేక్షిస్తోంది. అయితే.. వివరాల నమోదు, పరిశీలన, అనుమతుల మంజూరులో నెలకొన్న జాప్యాన్ని అధిగమించాల్సిన అవసరముంది.
నెమ్మదించిన పరీక్షలు
జిల్లాలో పాజిటివ్, వారి సన్నిహితులను పరీక్షించాక ఆ ఫలితాలు రావడానికే నాలుగైదు రోజులు పడుతోంది. ఇక వలస కూలీల విషయంలో కరోనా నిర్ధరణ పరీక్షలు చేయడానికి సరైన వసతులు, ఏర్పాట్లు లేవు. దీంతో వీరికి పరీక్షలు చేయడానికి చాలా సమయం పడుతోంది. వీరి నుంచి నమూనాలు సేకరించినా ఫలితాల వెల్లడికి సమయం పడుతోంది. ఆరోగ్య పరీక్షలు సత్వరమే కొలిక్కి తెచ్చేలా ఏర్పాట్లు చేయాల్సిన అవసరముంది.
సమన్వయ లేమి
వలస కూలీలకు వైద్య పరీక్షల్లో... నెగిటివ్ వచ్చాక సొంతంగా రవాణా ఖర్చు పెట్టుకొనే వీలున్న వారికి వెంటనే అనుమతిస్తున్నారు. ఆ స్థోమత లేని వారిని అధికారులే పంపిస్తున్నారు. అయితే.. ఒకే ప్రాంతానికి వెళ్లేవారు.. ఒక వాహనానికి సరిపడా కూలీలు పోగయ్యే వరకు వెళ్లే వీలు లేకపోవటంతో పడిగాపులు కాస్తున్నారు. వీరి తరలింపు విషయంలోనూ పోలీసు, రెవెన్యూ శాఖల మధ్య నెలకొన్న సమన్వయలేమిని చక్కదిద్దాలి.
కర్ణాటకలో భేష్
కర్ణాటకలో ఆగిన వలస కూలీలను స్వస్థలాలకు పంపేందుకు అక్కడి యంత్రాంగం వేగంగా స్పందిస్తోంది. పునరావాస కేంద్రాల్లో ఉన్న వలస కూలీలకు వెనువెంటనే వైద్య పరీక్షలు చేయిస్తోంది. నెగిటివ్ రాగానే వారికి ఎక్కడికక్కడే కలెక్టరేట్లలో ఈ-పాస్ మంజూరు చేస్తోంది. అంతేకాదు.. సరిహద్దుల్లోనూ పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖల వారు ఉండి మరోసారి పరిశీలించి.. వేగంగా స్వస్థలాలకు పంపుతున్నారు. మనకూ ఈవేగం అవసరం.
వీలైనంత త్వరగా అనుమతి
'జిల్లాకు రావడానికి, బయటకు వెళ్లడానికి అనుమతుల కోసం 5,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారు ఏఏ జోన్ల నుంచి వస్తున్నారో, ఏఏ జోన్లకు వెళ్లాలో పరిశీలించి అనుమతులు ఇస్తున్నాం. ఒకే ప్రాంతానికి చెందిన వారు ఎక్కువ మంది ఉంటే వారిని బస్సుల్లో పంపిస్తున్నాం. సొంత వాహనాల్లో వెళ్తామనే వారికీ అనుమతి ఇస్తున్నాం. స్పందన వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుంటే సరిపోతుంది. అన్నీ సక్రమంగా ఉంటే 2, 3 రోజుల్లో అనుమతి లభిస్తుంది.'-- డిల్లీరావు, జాయింట్ కలెక్టర్..
ఇవీ చదవండి.... వసతులు బాగున్నాయ్.. కానీ!