అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాల పరిధిలో కరోనా వైరస్ నిర్థరణ పరీక్షలు చేయించుకోవడానికి ఎదురు చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రాంతీయ వైద్యశాలతో పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంజీవని బస్సు ద్వారా వైరస్ నిర్ధరణ కోసం నమూనాలు సేకరిస్తున్నారు. చాలాచోట్ల వైద్యాధికారులు పరీక్షలకు అవసరమైన కిట్లు అందుబాటులో లేవంటూ వెనక్కి పంపుతున్నారు. ఫలితంగా పరీక్షలు చేయించుకోవాలనుకునే వారిలో ఆందోళన పెరుగుతోంది.
జిల్లాలోని తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో... ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న వివిధ మండలాలకు చెందిన వారు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పరిమిత సంఖ్యలోనే కిట్లు అందుబాటులో ఉన్నందున వైద్యాధికారులు చేతులెత్తెయ్యాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
కరోనా విస్తరిస్తున్న వేళ పట్టణం, పల్లెలు తేడాలేకుండా అందరిలోనూ ఆందోళన నెలకొంటోంది. చాలాచోట్ల కరోనా పరీక్షలు చేయించుకునేందుకు సరిపడా కిట్లు లేవన్న సమాచారం ప్రజల్లో ఆందోళన రెట్టింపు చేస్తోంది. అందరికీ పరీక్షలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రత్యేకంగా సంజీవని పేరుతో మొబైల్ బస్సును ఏర్పాటు చేసింది. మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జలుబు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా కరోనా వైరస్ పరీక్షలను చేయించుకోవాలనే ఆత్రుత ఎక్కువ మందిలో కలుగుతోంది.
ఇదీ చదవండి: