అనంతపురం జిల్లాలో అనేక కుటుంబాల్లో కొవిడ్ విషాదం నింపుతోంది. వైరస్ లక్షణాలను ముందుగానే గుర్తించకపోవటం, దీర్ఘకాల వ్యాధులున్న కారణంగా కరోనా సోకిన వారు మృత్యువాతపడుతున్నారు. కుటుంబంలోని అందరూ వైరస్ బారిన పడిన చోట్ల.. పిల్లలు మానసికంగా నలిగిపోతున్నారు. చిన్న కుటుంబాల్లో ఇంటిల్లిపాదికీ వైరస్ సోకడంతో ఆహారం తయారు చేసుకోవటం కూడా సమస్యగా మారింది.
కరోనా కారణంగా కుటుంబసభ్యులంతా మృతిచెంది అనాథలైన పిల్లల వివరాల సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఈనెల 19న జీఓ నెంబర్ 24ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం తలిదండ్రులను కోల్పోయిన 18 ఏళ్లలోపు పిల్లల పేరున.. ప్రభుత్వం 10 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయనుంది. బాధిత పిల్లలకు 25 సంవత్సరాల వయస్సు వచ్చాక నగదు పొందే అవకాశం కల్పించింది. దీని కోసం ICDS అధికారులు బాధిత పిల్లల వివరాల సేకరణ వేగవంతం చేశారు. అనంతపురం జిల్లాలో 42 కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ కొవిడ్‌తో మృతి చెందగా.. మరో 21 కుటుంబాల్లో తలిదండ్రుల్లో ఒకరిని మహమ్మారి బలిగొంది. ఇలాంటి సింగిల్ పేరెంట్ బాధితుల సంఖ్య జిల్లాలో అధికంగా ఉండటంతో ప్రత్యేక బృందాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు.
అనాథలైన పిల్లలందరికీ ఆర్థిక సహాయం చేస్తారా లేక ఒకరికేనా అనే విషయంపై స్పష్టత రాలేదు. అదే విధంగా తలిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన బాధిత కుటుంబాల విషయంలో కూడా ఎలా ముందుకెళ్లాలనే ఆదేశాల కోసం ఐసీడీఎస్ అధికారులు ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి: KRISHNA BIRTHDAY: సూపర్‌స్టార్ కృష్టకే సొంతమైన ఆ ఘనతలు