Loss to farmers with rains: అనంతపురం, సత్యసాయి జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొక్క దశలో పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో తాడిపత్రిలో ఓ ఇల్లు కూలిపోగా.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఆర్టీసీ బస్సు ఇరుక్కుపోయింది.
ఉరవకొండ మండలంలో బోర్ల కింద సాగు చేసిన వేరుసెనగ కోసి కుప్పలు వేయగా.. వరద నీటిలో పూర్తిగా నానడం వల్ల కుళ్లిపోయింది. అధికారులు ముందుగా హెచ్చరించి ఉంటే పంటను కాపాడుకునే వాళ్లమని రైతులు వాపోయారు.
సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో వాగులు, వంకలకు సమీపంలోని భూముల్లో పంటలు మునిగిపోయాయి. కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు సరిహద్దుల్లోని మడకశిర మండలానికి వరద పోటెత్తింది. చెరువులన్నీ పూర్తిగా నిండిపోయి మరవ పారుతున్నాయి. పంట మొక్కదశలోనే ఉండటంతో.. వ్యవసాయశాఖ నష్టం అంచనా వేయడం లేదు. దిగుబడికి సిద్ధంగా ఉన్న పంటలు 33 శాతానికి పైగా నష్టపోతేనే పంట నష్టం అంచనాల పరిధిలోకి తీసుకుంటామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: