భూ వివాదం కొనుగోలుదారులు, భవన నిర్మాణ కార్మికుల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. రెండు ఎకరాల ఐదు సెంట్ల విలువైన భూమి తమదేనంటూ రెండు వర్గాలు నిరసనకు దిగాయి. అనంతపురం జిల్లా కదిరి పట్టణ హిందూపురం ప్రధాన రహదారిలో ఆర్డీవో కార్యాలయానికి ఆనుకొని ఉన్న స్థలం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. 2018లో సర్వే నంబర్ 1713లో రెండెకరాల ఐదు సెంట్ల భూమిని ఐదుగురు వ్యక్తులు కొనుగోలు చేశారు. భూమిని చదును చేసుకొని హద్దులను ఏర్పాటు చేసుకున్నారు. రెండు రోజుల కిందట ఈ భూమి తమదేనంటూ భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున కార్మికులు ఈ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు.
ఐదుగురికి చెందిన భూమిలో భవన నిర్మాణ కార్మికులు తాత్కాలిక పునాదులను ఏర్పాటు చేశారు. అసలైన హక్కుదారుల నుంచి రెండు సంవత్సరాల కిందట కొనుగోలు చేసిన భూమిలో పునాదులు వేయడమేంటని నరసింహారెడ్డి, రాజశేఖర్ మరో ముగ్గురు తమ అనుచరులతో కలిసి వచ్చి జేసీబీ సాయంతో పునాదులను తొలగించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భవన నిర్మాణ కార్మికులతో వాగ్వాదానికి దిగారు. కార్మికుల వద్ద తమ భూమికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఉన్నా తీసుకురావాలని సవాల్ విసిరారు.
రోడ్డుపై బైఠాయింపు..
వామపక్ష పార్టీకి చెందిన ఓ నాయకుడి సాయంతో భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ భవన నిర్మాణ కార్మికులు కదిరి హిందూపురం ప్రధాన రహదారిపై ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. గంటపాటు రోడ్డుపై బైఠాయించడంతో ...వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని వివరించి ఆందోళన విరమించాల్సిందిగా పోలీసులు భవన నిర్మాణ కార్మికులకు నచ్చజెప్పారు. భూమి అసలైన యజమానులు ఎవరో అధికారులే తేల్చాలని కొనుగోలుదారులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: భారీగా నగదు పట్టుకున్నారు....తిరిగి ఇచ్చేశారు!