తర తరాల నుండి తమకు సంక్రమించిన పెద్దల ఆస్తి (పొలం) కోసం ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు యత్నించారు. పొలం తమదంటే తమదంటూ అనంతపురం జిల్లా,గుంతకల్లు మండలం లోని పులగుట్టపల్లి తండా గ్రామానికి చెందిన వారు పురుగుల మందు తాగారు. ఇద్దరు రైతుల పరిస్థితి విషమించడంతో వారిని గుంతకల్లులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పులగుట్ల పల్లి గ్రామంలో తమ పూర్వీకుల నుంచి తమకు వచ్చిన 3 ఎకరాల పొలం కోసం స్వామి నాయక్, వెంకటేష్ నాయక్ కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. వెంకటేష్ నాయక్‌కు చెందిన వారు తన భార్య, తనపై దాడి కి పాల్పడ్డారని మనస్తాపంతో స్వామి నాయక్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది జరిగిన కొద్ది సేపటికే వెంకటేష్ నాయక్ కూడా పురుగుల మందు తాగాడు.
వెంకటేష్ నాయక్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆ పొలం ప్రభుత్వం గతంలో తమ పూర్వీకులకు ఇచ్చిందని చెబుతున్నారు. రెండు సంవత్సరాలుగా అడుగుతున్నా తమ పొలాన్ని స్వామి నాయక్ తిరిగి ఇవ్వలేదని.. వెళ్లి అడిగినందుకు అనవసరంగా తాము దాడి చేశామంటూ ఆసుపత్రిలో చేరి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందువల్లే వెంకట్ నాయక్ పొలంలో ఆత్మహత్యకు యత్నించాడని, దానిని గమనించి ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ప్రస్తుతం సోదరులిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: