ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని ముగ్గురు నాయకులకు పంచారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. తేదేపా అనంతపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై గురువారం రాయదుర్గం వచ్చిన సందర్భంగా నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు. ముందుగా పట్టణంలోని శాంతినగర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక తెదేపా కార్యాలయంలో కాలవ శ్రీనివాసులును నాయకులు, కార్యకర్తలు, అభిమానులు... ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డికి, కోస్తాంధ్రను వైవీ సుబ్బారెడ్డికి, రాయలసీమను సజ్జల రామకృష్ణారెడ్డికి రాసిచ్చారని విమర్శించారు. మూడు ప్రాంతాలను గుంపగుత్తగా రాసిచ్చారని మండిపడ్డారు. జగన్ నాయకత్వంలో పనిచేస్తున్న వారు కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో బీసీ మంత్రులను లక్ష్యంగా చేసుకొని ఆ పార్టీలో ఉండే నాయకులే ఏ రకంగా అవమానపరుస్తున్నారో చూస్తున్నామని వ్యాఖ్యానించారు.
బడుగులకు తెలుగుదేశం పార్టీ ఆది నుంచి అధిక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు అధ్యక్షులు ప్రకటిస్తే... పదిమంది బీసీలకు చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారని వివరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కేబినెట్లో ఎనిమిది మంది బీసీలకు మంత్రి పదవులు కేటాయించారని గుర్తు చేశారు. అత్యంత కీలకమైన శాఖలను బీసీలకు ఇచ్చి నిజమైన అధికార భాగస్వామ్యం కల్పించి నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు.
ఇదీ చదవండి: