అనంతపురం జిల్లాలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు మంజులా వెంకటేష్ మాట్లాడారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఏసీబీకి పట్టుబడ్డ వారిని సస్పెండ్ చేయాలని అధికారులను కోరారు. దీనిపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. పైస్థాయి ఉద్యోగులు వ్యక్తిగత లాభాల కోసం ఆలయ గౌరవాన్ని ఫణంగా పెట్టటం దురదృష్టకరమన్నారు.
ప్రతి ఆరు నెలలకొకసారి ఆలయంలో ఏదో ఒక అవినీతి బయటపడుతుందని హిందూ ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు అన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం ఉండటం లేదని చెప్పుకొచ్చారు. ఆలయ అధికారి అయిన సాగర్‌బాబును సస్పెండ్ చేయాలని కోరారు. గతంలోనూ అతనిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. లేని పక్షంలో ఉద్యమబాట పడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గుడిలో జరుగుతున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రికి, కమిషనర్‌కి లేఖ రాసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఘనంగా 'సారే జహాసే అచ్చా' గేయరచయిత అల్లామా ఇక్బాల్ జయంతి