ఖరీఫ్ సీజన్‌లో రాయితీపై ఇచ్చే వేరుశనగ విత్తన సేకరణకు ఏపీ సీడ్స్ అధికారులు ముప్పుతిప్పలు పడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో వేరుశనగ క్వింటా రూ.6 వేల 800 పలుకుతుండగా, ప్రభుత్వం 6 వేల 400 రూపాయలే ఇస్తోంది. దీనివల్ల ఏపీ సీడ్స్‌కు పంట అమ్మడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. విత్తన సేకరణ పరిశీలనకు ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్‌బాబు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు.. ధర పెంచాలని రైతుల నుంచి గట్టిగా డిమాండ్ వచ్చింది. సేకరించిన పది రోజుల తర్వాతే డబ్బులు చెల్లిస్తామని అధికారులు చెబుతుండటం కూడా.. సేకరణలో సమస్యగా మారింది. తీసుకున్న వెంటనే డబ్బులు ఇవ్వాలని రైతులు పట్టుబడుతున్నట్లు.. 'మన విత్తన కేంద్రాల'కు సాంకేతిక సలహాలిస్తున్న స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి.
రాయితీపై పంపిణీ
గతంలో వివిధ జిల్లాల వ్యాపారుల నుంచి విత్తనం కొనుగోలు చేసి, అనంతపురం జిల్లా రైతులకు రాయితీపై పంపిణీ చేసేవారు. ఈసారి ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయశాఖ క్షేత్రస్థాయి అధికారులు.. విత్తనాల కోసం రైతుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కానీ డబ్బులిచ్చి వేరుశనగ తీసుకోవాలని రైతులు ఖరాఖండిగా చెప్పేస్తుండటంతో.. ఏంచేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. ఏదేమైనా నెలాఖరు నాటికి సేకరణ పూర్తి చేస్తామని చెబుతున్నారు.
విత్తన పంపిణీకి ప్రణాళిక
మే తొలి వారం నుంచి వేరుశనగ విత్తన పంపిణీకి ప్రణాళిక రూపొందించిన అధికారులు.. స్థానికంగా సేకరణ పూర్తికాకుంటే పొరుగు జిల్లాలు, తెలంగాణ వ్యాపారుల నుంచి కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి నివేదించారు.
ఇదీ చదవండి: