రాష్ట్రానికి వెన్నెముక లాంటి రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆదివారం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామ పొలాల్లో ఆయన పర్యటించారు. వర్షానికి దెబ్బతిన్న వేరుశనగ పంటలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వేరుశనగ పంట చేతికి వచ్చిన సమయంలో వర్షాలతో పూర్తిగా దెబ్బతినడం బాధాకరమని అన్నారు.
అప్పులు చేసి పంటలు వేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల వద్దకు వచ్చి స్థితి గతులను అడిగి తెలుసుకొవాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.