రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం, శాసన మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఐకాస నాయకులతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీ చేశారు. ర్యాలీ ప్రారంభమయ్యే సమయంలో పోలీసులు.. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులును ఆయన ఇంటి వద్ద అడ్డుకున్నారు. తెదేపా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో ర్యాలీకి పోలీసులు అనుమతించారు. పట్టణంలోని శాంతి నగర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ వారసుడిగా నిలిచారని మండిపడ్డారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు.. విశాఖ రాజధాని నిర్మాణానికి అనుకూలంగా లేవని తేల్చి చెప్పారని.. వాటిని కప్పి పుచ్చి విశాఖను రాజధానిగా ఎంపిక చేయడంలో ప్రభుత్వ ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: