అనంతపురం జిల్లా రాయదుర్గంలోని తెదేపా నాయకులకు సంబంధించిన కట్టెల కోత మిల్లులపై అటవీ శాఖ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడితో దాడులు నిర్వహించారని యజమానులు ఆరోపించారు. అనుమతులు లేవంటూ పట్టణంలోని పలు కోత మిల్లులను అధికారులు సీజ్ చేశారు. దీనిని నిరసిస్తూ తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టణంలో చాలా కట్టెల కోత మిల్లులు ఉండగా.. తెదేపా నేతలకు సంబంధించిన వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించడం సరికాదని వాదనకు దిగారు. రోజూ ట్రాక్టర్లలో అక్రమంగా కలపను తరలించి.. సొమ్ము చేసుకుంటున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. కలప నిల్వ చేస్తున్న స్థావరాలను తామే స్వయంగా చూపిస్తామని, చర్యలు తీసుకునే ధైర్యం మీకుందా? అంటూ ఎదురుదాడికి దిగారు. దీంతో అనుమతులు తెచ్చుకునేందుకు 15 రోజుల గడువును ఇస్తున్నట్లు అటవీశాఖ అధికారి తెలిపారు.