అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సాగు వేగం పుంజుకుంది. వారం రోజులుగా వర్షాలు కురవటంతో జిల్లాలో విత్తనం వేయటానికి భూమి పదునైంది. రైతులు ఎరువుల కొనుగోలు మొదలు పెట్టారు. ఈసారి జిల్లాలో ఖరీఫ్ కోసం లక్షా 47 వేల మెట్రిక్ టన్నుల ఎరువు అవసరం ఉంటుందని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు తక్కువ ధరకే ఇవ్వటానికి మార్క్ఫెడ్ నిర్ణయించింది.
గతంలో రైతులు ఆర్బీకేల్లో డబ్బులు చెల్లించిన తర్వాత, రెండు రోజులకు ఎరువులు పంపించేవారు. ఈసారి ఆర్బీకేల పరిధిలోనే గ్రామాల్లో గోదాములు ఏర్పాటు చేసి, రైతులు డబ్బు చెల్లించిన వెంటనే ఎరువులు తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, కచ్చితమైన తూకంతో ఆర్బీకేల్లో ఇస్తున్నామని..రవాణా ఖర్చులు కూడా మిగులుతాయని మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నారు.
అయితే..నగదు చెల్లించి ఎరువులు తీసుకోవాల్సి ఉన్నందున రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు మందకొడిగా సాగుతోంది. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు ఎరువుల దుకాణాల్లో అప్పుతో కొనుగోలు చేస్తున్నారు. ఆర్బీకేల్లో ఎరువుల కొనుగోలు కోసం పంట రుణం తరహాలో రైతులకు వెసులుబాటు కల్పించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలు.. ఆదాయం లేక కుంగుతున్న పేదలు!