Farmers protest: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం, అమిద్యల గ్రామంలో మూడు వేల మంది రైతులు ఉండగా కేవలం 1200 మంది రైతుల పేర్లు నమోదు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులోనూ కేవలం700 మంది రైతులకు మాత్రమే పంటల బీమా ప్రకటించడంతో అధికారులపై రైతులు మండిపడ్డారు. దీనిపై సచివాలయం ఉద్యోగులను రైతులు నిలదీశారు. సచివాలయానికి తాళాలు వేసి సచివాలయంలో ముందు బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పి.. ఇప్పుడు రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. పరిస్థితి ఉద్ధృతంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉరవకొండ తహసీల్దార్ మునివేలు, అగ్రికల్చర్ అధికారి శశికళ అక్కడికి చేరుకుని రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా రైతులు వినలేదు. అర్హులైన తమకు ఎందుకు పంటల బీమా ఇవ్వలేదని అధికారులను ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్నవారి పేర్లు ఎలా నమోదు చేశారని నిలదీశారు. వ్యవసాయ అధికారులతో సమీక్షించి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
కళ్యాణదుర్గం మండలం పంచాయతీ పరిధిలోని తిమ్మసముద్రం, మానిరేవు గ్రామ సచివాలయానికి సైతం రైతులు తాళాలు వేశారు. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వాతావరణ బీమా పథకంలో పంటలకు ఏమాత్రం బీమా మంజూరు చేయలేదని ఆగ్రహించిన రైతులు గ్రామ సచివాలయాలకు తాళాలు వేశారు. సచివాలయం ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రస్తుత పాలకులకు రైతులు తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించకపోతే తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
పెద్దవడుగూరు మండలం చిన్నవడుగూరు, వీరన్నపల్లి , కొట్టాలపల్లి, నాగలాపురం తదితర గ్రామాల రైతులకు అర్హులైన కూడా మాకు పంట బీమా పడలేదని చిన్నవడుగూరు సచివాలయం ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. పంట వేసిన కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ క్రాప్ బుకింగ్ చేయకపోవడం వల్ల తామూ నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి పంపించేశారు.
ఇవీ చదవండి: