విద్యుత్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కనేకల్ మండల కేంద్రంలో విద్యుత్ కార్యాలయం ముందు అన్నదాతలు నిరసనకు దిగారు. ప్రధాన రహదారిలో బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ అంతరాయంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని తెలిపారు. నీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే వారే లేరని వాపోయారు. సమస్యను పరిష్కరించే వరకు నిరసన విరమించేదిలేదని స్పష్టం చేశారు. రాస్తారోకో కారణంగా ప్రధాన రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అన్నదాతలతో మాట్లాడారు. ఇవాళ పండుగ కావడంతో విద్యుత్ అధికారులు అందుబాటులో లేరని కనేకల్ ఎస్సై సురేష్, రైతులకు నచ్చజెప్పారు. రైతుల సమస్యలను డీఈఈ శేఖర్‌కు ఎస్సై చరవాణిలో వివరించారు. డీఈఈ..కనేకల్ వచ్చి విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దాంతో రైతులు ధర్నాను విరమించారు.
ఇదీ చదవండి: అనంతపురంలో శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు