అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో వేరుశనగ పంటను అధికంగా పండిస్తారు. వీటితోపాటు మల్బరీ సాగు కూడా ప్రాధాన్యమిస్తారు. అయితే ప్రస్తుతం కరోనా దెబ్బకు మార్కెట్లో మల్బరీకి రేటు లేనందున వారి వ్యవసాయ సాగు విధానాలను మార్చుకుంటూ ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మడకశిర మండలంలోని బి.రాయపురం గ్రామానికి చెందిన రైతు నర్సేగౌడ్ అతని కుమారుడు నాగభూషణ వారి కుటుంబానికి చెందిన 14 ఎకరాల పొలంలో అనుభవం లేకున్నా మొట్టమొదటిసారిగా ఉద్యాన పంటలైన బొప్పాయి, అరటి, కర్బూజ సాగు చేశారు. అనుభవజ్ఞుల సలహాలతో పంట అధిక దిగుబడి వచ్చేలా కష్టపడ్డారు. ప్రస్తుతం పంట చేతికి వచ్చింది. కరోనా దెబ్బకు కొనుగోలుదారులు, మార్కెట్ సౌకర్యం లేక గిట్టుబాటు ధర వస్తుందో లేదోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో వేరుశనగ, మల్బరీ పంట సాగు చేసేవాళ్లం. లాక్ డౌన్ కారణంగా మల్బరీకి రేటు లేకపోవడంతో సాగు విధానం మార్చుకున్నాం. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న.. మా అన్న ప్రోత్సాహంతో మొదటిసారిగా ఉద్యాన పంటలు సాగు చేస్తున్నాం. మా కుటుంబానికి ఉన్న మొత్తం 14 ఎకరాల భూమిలో రెండు బోర్లు వేయించి జింకలు, మూగజీవాల బెడద నుంచి పంటను కాపాడేందుకు పొలం హద్దులకు ఫెన్సింగ్ వేయించాం. కర్ణాటక, అనంతపురం నర్సరీ నుంచి మొక్కలు తెప్పించి మూడు ఎకరాల్లో అరటి, 3 ఎకరాల్లో బొప్పాయి, నాలుగు ఎకరాల్లో కర్బూజ, ఒకటిన్నర ఎకరాల్లో టమోటా వీటితో పాటు మిగిలిన భూమిలో వేరుశనగ పంటను సాగు చేస్తున్నాం. దాదాపు రూ.15 లక్షల వరకు పెట్టుబడి అయింది -రైతు
ప్రస్తుతం బొప్పాయి పంట కోతకు వచ్చింది. మరో రెండు మూడు నెలలకు అరటి కూడా కోతకు వస్తుంది. అయితే మడకశిర ప్రాంతంలో ముందు నుంచి మార్కెట్ సౌకర్యం లేదు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో బెంగళూరు, చెన్నై లాంటి మహా నగరాలకు వెళ్లేందుకు భయమేస్తోంది. ఒకవేళ వెళ్ళినా అక్కడ కూడా పూర్తిస్థాయిలో మార్కెట్ లేనందున మద్దతు ధర పలకడం కష్టంగా ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మాలాంటి రైతుల వద్ద ఉన్న పంటను ప్రభుత్వమే గిట్టుబాటు ధరతో కొనుగోలు చేసి ఆదుకోవాలి -రైతు
ఇదీ చదవండి: హుందాతనానికి, క్రమశిక్షణకు ప్రణబ్ మారుపేరు: చంద్రబాబు