UNTIMELY RAINS DAMAGE CROPS : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. మరి కొన్ని ప్రాంతాల్లో కళ్లాల్లో ఆరబోసి ధాన్యం, మిర్చి, పసుపు పూర్తిగా తడిచిపోయింది. అరటి చెట్లు నేలకొరిగాయి.
అరటి రైతుల ఆందోళన : అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో శనివారం ఉదయం అకాల వర్షంతో మండలంలోని గొంది రెడ్డిపల్లి గ్రామంలో అరటి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గొంది రెడ్డిపల్లి గ్రామంలో 5 మంది రైతులకు సంబందించిన 12 ఎకరాల్లో అరటి పంట నెలకొరిగింది. దీంతో దాదాపు 70 లక్షలు ఆస్థి నష్టం సంభవించిందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన నాగిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, తిరుపాల్ రెడ్డి, నూర్జహాన్, చిన్నక్రిష్ణ రెడ్డి, దాదాపుగా 13 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా దెబ్బతింది. దెబ్బతిన్న అరటితోటను చూసి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఎలాగైనా రైతుల్నీ ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.
" గాలివాన రావటం వల్ల మూడు ఎకరాల అరటితోట పడిపోయింది. 3 లక్షల పెట్టుబడి పెట్టాను. మొత్తం నేలమట్టం అయిపోయింది. ప్రభుత్వం ఆదుకోకుంటే చాలా కష్టంగా ఉంటుంది. " - అరటి రైతు
వేరుశనగను కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు : కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం సాయంత్రం జోరుగా వాన కురిసింది. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో మోకాళ్లలోతు నీరు చేరింది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుమల నగర్, శ్రీనివాస్ భవన్ కూడలి అంతా జలమయమైంది.లంగర్ బావి వీధి, కంచిగారి వీధి, గౌలి పేట్, పెద్ద మార్కెట్, రైతు బజార్ వంటి లోతట్టు ప్రాంతాలు పూర్తి వర్షపు నీటితో నిండినాయి. మార్కెట్ యార్డులో ఆరబోసిన వేరుశనగను వర్షం నుంచి కాపాడుకునేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. చేతికొచ్చిన పంట తడిచిపోకుండా పట్టాలు కప్పారు.
తడిసిన మిర్చి, పసుపు : కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం లో అకాల వర్షానికి పసుపు కళ్లాల్లో ఆరబెట్టినా మిర్చి, పసుపు పంటలు తడిసి పోయాయి. వర్షాలకు పంటలు దెబ్బతినటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
ముమ్మరంగా సాగుతున్న వరి కోతలు : కోనసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ముండేపులంక, నాగులంక, వాడ్రేవుపల్లి, మానేపల్లి తాటిపాక, రాజోలు ప్రాంతాల్లో వర్షానికి రైతులు ఇబ్బందిపడ్డారు. రబీ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
రైతులకు తీవ్ర నష్టం : గుంటూరు నగరంలో సుమారు గంటకుపైగా వర్షం కురవటంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మొక్కజొన్న, జొన్న పంటలకు నష్టం జరుగుతుందని రైతుల ఆందోళన చెందుతున్నారు. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి పంటను పట్టాలు కప్పి కాపాడుకుంటున్నారు.
పూర్తిగా తడిసిపోయిన ధాన్యం : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం రైస్ మిల్లు వద్ద అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.
ప్రభుత్వాన్ని వేడుకుంటున్న రైతులు : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు రైతులు భారీగా నష్టపోయారు. ప్రభుత్వ అధికారుల పంట నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి