అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ముచ్చిరామి గ్రామానికి చెందిన రైతు కృష్ణయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకుని తన సమస్యను వివరిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అతనిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గ్రామానికి చెందిన లక్ష్మిరెడ్డి, కృష్ణయ్య పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. వీరిద్దరికి రెండేళ్లుగా భూవివాదం నడుస్తోంది. ఈ దశలో కృష్ణయ్య పైకోర్టుకు వెళ్లాడు. కోర్టు వివాదంలో ఉన్న సమయంలో పోలీసులు తనను పిలిపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని..బూతులు తిడుతున్నారని కృష్ణయ్య వాపోయాడు.
పోలీసుల ప్రోద్భలంతో తన పొలంలోని చీనీ చెట్లను రైతు లక్ష్మిరెడ్డి ధ్వంసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు కోర్టులో ఉన్నా.. వాళ్లు రోజు కొడుతూ.. బూతులు తిడున్నారని ఆరోపించారు. వాళ్ల చేతిలో చావడం కంటే నేనే చనిపోతానని వాపోయాడు. ఈ ప్రభుత్వంలో బీసీలకు అడుగడుగునా అవమానాలే జరుగుతున్నాయని.. చెట్లు చనిపోయినా..నేను, నా పిల్లలు చనిపోయినా ఒకటేనని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి. జేపీ వెంచర్స్ లిమిటెడ్‌కు ఇసుక బాధ్యతలు అప్పగించేందుకు ఏర్పాట్లు