Nara Lokesh Yuva Galam Padayatra: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 61వ రోజు ఉరవకొండ నియోజకవర్గంలో సాగింది. బుధవారం అనంతపురం గ్రామీణం పరిధిలోని ఎమ్వైఆర్ కల్యాణ మండపం నుంచి ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర.. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు వరకు సాగింది. ఉరవకొండ సరిహద్దు ప్రాంతంలో.. ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు.. లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు.
కూడేరులో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన లోకేశ్.. జాబ్ క్యాలెండర్ పేరిట యువత, నిరుద్యోగుల్ని సీఎం జగన్ మోసం చేశారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చిన జగన్.. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చింది లేదన్నారు. ఏటా 6,500 పోలీసు కొలువులు, మెగా డీఎస్సీ అని చెప్పి మోసం చేశారన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు పక్కాగా అమలు చేస్తామన్నారు. గుంటూరు, అనంతపురం, విశాఖ జిల్లాల్లో మూసేసిన స్టడీ సర్కిళ్లను తిరిగి ప్రారంభిస్తామన్నారు.
"సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ పేరిట యువత, నిరుద్యోగుల్ని మోసం చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన జగన్.. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?.. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే.. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు పక్కాగా అమలు చేస్తాం." - నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
ఎన్నికల్లో విజయం కోసం లోకేశ్ పాదయాత్ర చేయడం లేదని.. రాష్ట్ర ప్రజల కోసం, రేపటి తరం భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంతో నడుస్తున్నారని.. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా.. ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు.
యువగళం పాదయాత్రలో లోకేశ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కూడేరులో కార్యకర్తలు గజమాలను క్రేన్ సాయంతో వేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో.. గజమాల ఒకవైపు తెగిపోయి లోకేశ్ ఎడమ భుజాన్ని తాకుతూ పడిపోయింది. వెంటనే కార్యకర్తలు అప్రమత్తమై.. గజమాలను పక్కకు తీసేశారు.
కాగా.. ఇవాళ 62వ రోజు పాదయాత్రలో భాగంగా.. కూడేరు క్యాంప్ నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. సంగమేష్ కాలనీలో స్థానికులతో లోకేశ్ మాటామంతీ నిర్వహించనున్నారు. అరవకూరులో స్థానికులతో సమావేశం కానున్నారు. కమ్మూరు శివార్లలో బీసీలతో ముఖాముఖి చేపట్టనున్నారు. భోజన విరామం అనంతరం కమ్మూరు శివారు నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర శింగనమల నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. అనంతరం సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
ఇవీ చదవండి: