అనంతపురం జిల్లా తనకల్లు మండలం గోవిందువారిపల్లిలోని చరిత వీఓ సంఘం పరిధిలోని ఏడు మహిళా సంఘాల్లో రూ. 25.71 లక్షలను యానిమేటర్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కరస్పాండెంట్ జయలక్ష్మి మాయం చేసిన ఘటనపై వెలుగు అధికారులు సోమవారం విచారించారు. వెలుగు జిల్లా బ్యాంకు లింకేజీ అధికారి మల్లికార్జున, ఏరియా కోఆర్డినేటర్ రామ్మోహన్ గోవిందువారిపల్లిలో యానిమేటర్ జయలక్ష్మి, సంఘాల్లోని సభ్యులు, లీడర్లతో చర్చించారు. విచారణలో రూ. 21 లక్షలు యానిమేటర్ పక్కదారి పట్టించినట్లు అధికారులు నిర్ధరించారు. వారం రోజుల్లో 50 శాతం రూ. 10 లక్షలు చెల్లిస్తానని మిగిలిన మొత్తం జూన్ నెల 10లోగా చెల్లిస్తానని యానిమేటర్ జయలక్ష్మి అధికారుల ఎదుట ఒప్పుకున్నారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా ఇచ్చారు.
అంగీకరించని సభ్యులు
యానిమేటర్ జయలక్ష్మి 7 సంఘాల్లో రూ. 21 లక్షలు తన సొంతానికి వాడుకొని తిరిగి చెల్లిస్తానంటే అంగీకరించేది లేదని సంఘాల సభ్యులు, లీడర్లు స్పష్టం చేశారు. యానిమేటర్ వాడుకున్న మొత్తం వెలుగు అధికారులే రికవరీ చేసి సంఘాల్లో జమచేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విచారణలో ఏపీఎం వెంకటనారాయణ ఉన్నారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ ట్యాంకర్ 5 నిమిషాలు ఆలస్యం.. 11 మంది కొవిడ్ రోగులు మరణం