అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలోని నారాయణమ్మ కాలనీకి చెందిన మూడో సచివాలయం వాలంటీర్ గంగరత్నమ్మ పెనుకొండ ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం కోసం వెళ్లింది. డాక్టర్లు అందుబాటులో లేకపోవటంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో పాటు గంటల తరబడి వేచి ఉంచారని, ఎంత సేపటికీ డాక్టర్లు రాలేదని బంధువులు తెలిపారు. చివరకు హిందూపురం లేదా మడకశిర వెళ్లాలని సిబ్బంది సూచించారని తెలిపారు. దిక్కుతోచని పరిస్థితుల్లో నిండు గర్భిణిని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ వైద్యులు పరీక్షించి బిడ్డ మరణించిందని ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసి పంపించారు. గంట ముందు వచ్చి ఉంటే బాబు బతికి ఉండేవాడని.. ఆలస్యం వల్ల బాబు మృతి చెందాడని వైద్యులు తెలిపారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వారి బంధువులు ధర్నా చేపట్టారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ సొంత ఇలాకలోని ప్రభుత్వాసుపత్రిలో గర్భిణిల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తుంటే పట్టించుకునే నాథుడే లేడని బాధితులు పేర్కొన్నారు. పెనుకొండ వైద్యశాలలో సక్రమంగా విధులు నిర్వహించని వైద్యులపై చర్యలు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి