అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన సాయిరాజ్ ఐటిఐ రెండో సంవత్సరం చదువుతున్నాడు. విద్యాదీవెన కోసం ఆధార్ కార్డు అప్డేట్ చేయాలని అతనికి కళాశాల అధ్యాపకులు తెలిపారు. దీంతో గత ఫిబ్రవరిలో దరఖాస్తు చేశాడు. అయితే కొద్ది రోజుల తర్వాత.. సాయిరాజ్ చరవాణికి " మీరు నమోదు చేసిన ఆధార్ నెంబరు గల సభ్యులు మరణించారని..వారి కుటుంబ సభ్యులు ధ్రువీకరించినందున దరఖాస్తు స్వీకరించబడదు" అని సందేశం వచ్చింది. రేషన్ కార్డులో కూడా అతని పేరు లేదు. దీంతో సాయిరాజ్, అతని తండ్రి శ్రీనివాసులు అవాక్కైయ్యారు.
అప్పటినుంచి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. కానీ సమస్యకు మాత్రం పరిష్కారం దొరకలేదు. అధికారులు బతికుండగానే చనిపోయినట్లుగా ధ్రువీకరించడంతో విద్యాదీవెనతో పాటు రేషన్, ఇతర ప్రభుత్వ పథకాలు కూడా అందడంలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బతుకు బండిని నడిపేందుకు మగ్గం నేస్తూ.. ఇంటింటికి తిరిగి పాల ప్యాకెట్లు వేస్తూ జీవిస్తున్నామని సాయిరాజ్ తెలిపాడు.
తన భార్య చనిపోయి మూడు నెలలు అయిందని...ఆ బాధలో ఉన్న తనకు బతికి ఉన్న కుమారుడు చనిపోయినట్లు అధికారులు చూపడంతో మరింత మనోవేదనకు గురవుతున్నాని శ్రీనివాసులు వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి తప్పును సరిదిద్దాలని సాయిరాజ్, తండ్రి శ్రీనివాసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి : Nara Lokesh: పరిహారం ఇవ్వకుండా భూమి లాక్కోవడమేంటి..?: నారా లోకేశ్