సురక్షిత నీటిని ప్రజలకు సరఫరా చేసే బాధ్యత ప్రభుత్వాలు, గ్రామ పంచాయతీలదే. ప్రస్తుతం మంచినీటి పథకాల నిర్వహణపై అలసత్వం నెలకొంది. నీటి వనరుల సేకరణ నుంచి గ్రామాలకు చేర్చేంత వరకు అడుగడుగునా బాధ్యతారాహిత్యమే కనిపిస్తోంది. ఫలితంగా పల్లె జనం జబ్బుల బారిన పడుతున్నారు.
ప్రస్తుతం వర్షాకాలం. తాగునీరు కలుషితం అయ్యే అవకాశం అధికం. అందులో ఓవర్‌హెడ్ ట్యాంకులు, లీకైన పైపుల వద్ద కలుషితం అవుతుంది. ప్రధాన బహుళ రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ ఫర్వాలేదనిపించినా, పూర్తి స్థాయిలో క్లోరినేషన్ చేయడం లేదు.
సురక్షితం.. అబద్ధం
గ్రామ పంచాయతీల పరిధిలో పథకాలు అధ్వానంగా తయారయ్యాయి. బోర్ల నుంచి సేకరించే నీటిని ట్యాంకులకు చేర్చి, క్లోరినేషన్ చేసి సురక్షిత నీటిని ప్రజలకు అందజేయాలి. ప్రస్తుతం జిల్లాలో సరఫరా అయ్యే తాగునీరు శ్రేయస్కరం కాదనే చెప్పవచ్ఛు పల్లెల్లో నిర్మించిన ట్యాంకులను సక్రమంగా శుభ్రం చేయడం లేదు. తాగునీటి నిబంధనలు పాటించడం లేదు. పాత ట్యాంకుల మూతలు శిథిలావస్థకు చేరుకోగా, మరికొన్ని ధ్వంసమయ్యాయి. ధూళి, దుమ్ము పడి నీరు అపరిశుభ్రంగా మారుతోంది.
పొంచి ఉన్న ముప్పు
మూతలు లేని ట్యాంకుల్లోకి వర్షపు నీరు చేరి రంగు మారే అవకాశం ఉంది. ఆ నీటిని తాగడం వల్ల విరేచనాలు, మలేరియా తదితర వ్యాధులు ప్రబలనున్నాయి. గతేడాది వర్షాకాలంలో కలుషిత నీరు తాగి పలువురు ఆసుపత్రి పాలైన ఘటనలు ఉన్నాయి.
వజ్రకరూరు మండలం చాబాలలో కలుషిత నీరు సరఫరా అవుతోంది. ఇక్కడ రెండు బోర్లున్నా నీటిలభ్యత అంతంత మాత్రమే. శ్రీరామిరెడ్డి పథకం నుంచి సరఫరా అయ్యే నీరు కలుషితమై రంగుమారి వస్తోంది. దీంతో గ్రామస్థులు శుద్ధజల ప్లాంటు నుంచి నిత్యం కొనుగోలు చేస్తున్నారు. కంబదూరు మండలం ఐపార్శపల్లిలోని ఓవర్‌హెడ్ ట్యాంకు ఇది. దీనికి పైభాగాన ఉన్న మూతలు ధ్వంసం కావడంతో వర్షపు నీరు, గాలిలోని దుమ్ము ధూళి ట్యాంకులో పడి నీరంతా అపరిశుభ్రంగా మారుతోంది. తరచూ శుభ్రం చేయకపోవడం వల్ల కలుషిత నీరు సరఫరా అవుతోంది.
నిబంధనలు ఇలా..
క్లోరినేషన్ ప్రతి రోజు చేయాలి. ఉదయం, సాయంత్రం ప్రతి ట్యాంకుకు సరిపడే బ్లీచింగ్ ద్రావణం కలిపిన తర్వాత నీటిని సరఫరా చేయాలి.నెలకోసారి ట్యాంకులను తప్పనిసరిగా శుభ్రం చేయాలి. ట్యాంకుపైన శుభ్రం చేసిన తేదీ, శుభ్రం చేయబోయే తేదీలను నమోదు చేయాలి. వర్షాకాలంలో ప్రతివారం ‘డ్రై’ డే పాటించాలి.ట్యాంకు పైన, సంప్‌వెల్, వాల్వ్‌పిట్సు, మ్యాన్‌హోల్‌పైన కవర్లతో మూసి ఉంచాలి. నీరు, చెత్త చెదారం ఉండకుండా, లీకేజీలు లేకుండా చూడాలి. ఆవరణం పరిశుభ్రంగా ఉంచాలి.
నిర్వహణ ఇలా..
మారుమూల గ్రామాల్లో ప్రధాన పథకాల యాజమాన్యాలు నీటి నాణ్యత నిబంధనలు పాటించలేదు. పంచాయతీ బోర్ల నుంచి సరఫరా అయ్యే నీరు క్లోరినేషనుకు నోచుకోలేదు.పల్లెల్లో రక్షిత ట్యాంకులు ఏళ్ల నుంచి శుభ్రతకు నోచుకోలేదు. నీటి నాణ్యత నియమాలు బేఖాతరు చేస్తున్నారు. ఏ కాలమైనా ట్యాంకుల పట్ల నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో సగానికి పైగా ట్యాంకులకు పైమూతలు లేవు. ట్యాంకుల కిందిభాగంలో ఉండే వాల్వుపిట్సులో నీరు, చెత్త, మురుగుతో నిండి ఉంటున్నాయి. పైపుల లీకేజీలు నిత్యకృత్యంగా మారాయి.
పథకాల నిర్వాహకులదే బాధ్యత
గ్రామాల్లో రక్షిత మంచినీటి, సీపీడబ్ల్యూపీ ట్యాంకుల నిర్వహణ బాధ్యత పంచాయతీలు, ఆయా పథకాల యాజమాన్యాలదే. తప్పనిసరిగా నెలకోసారి తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయించాలి. ‘డ్రై’ డే పాటించాలి. ఏఈలను పంపి, పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో ట్యాంకులను శుభ్రం చేయించేలా చర్యలు తీసుకుంటాం.
- హరేరామనాయక్, పర్యవేక్షక ఇంజినీరు, గ్రానీస
ఇదీ చదవండి:
'పది' పరీక్షలు పెట్టాలా..? వద్దా..? తేల్చుకోలేకున్న ప్రైవేటు యాజమాన్యాలు