అనంతపురం జిల్లాలోని తమ్ముడేపల్లి గ్రామంలో రాజేంద్రప్రసాద్, లలిత దంపతులకు మగ సంతానం లేదు. ఒక్కగానొక్క కుమార్తె లిఖిత. ఈ అమ్మాయి పదవ తరగతి చదువుతోంది. వీరిది రైతు కుటుంబం. ఈనెల 14న రాజేంద్ర ప్రసాద్ తోటకు వెళ్లారు. ఆకస్మాత్తుగా గుండెనొప్పితో కుప్పకూలారు. సమాచారం తెలుసుకున్న ఆయన భార్యతో పాటు చుట్టుపక్కల వారు అమరాపురం ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ సూచన మేరకు మడకశిర ఆసుపత్రికి తరలించేలోపు రాజేంద్ర ప్రసాద్ మరణించారు. ఆయన అంత్యక్రియలకు అతని అన్నదమ్ములు, వారి పిల్లలు హాజరయ్యారు. వారి కట్టుబాట్ల పరంగా ఒకసారి అంత్యక్రియలు నిర్వహించిన వారు మరొకరికి అంత్యక్రియలు చేయరాదు. ఈ కారణంగా.. సంప్రదాయాన్ని పూర్తి చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితిలో.. తండ్రి లేడన్న బాధను దిగమింగిన లిఖిత.. అంత్యక్రియలకు ముందుకు వచ్చింది. పెద్దలను ఒప్పించింది. అన్నీ తానై కార్యక్రమాన్ని పూర్తి చేసింది.
ఇవీ చదవండి: