అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ.. బీఎస్పీ నాయకులు ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలి నుంచి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్న బీఎస్పీ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడుతో పాటు బీఎస్పీ నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బహుజనులంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో ధర్మవరం ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెబుతామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు సంపద రావు హెచ్చరించారు.
'క్షమాపణ చెప్పాలి.. లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తాం'
జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి క్షమాపణ చెప్పాలని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించిన నాయకులు.. నిబద్ధతతో పని చేస్తున్న కలెక్టర్‌పై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు.
ఈ ప్రభుత్వం దళితులను మొదటినుంచి తక్కువస్థాయిలో చూస్తూ చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడుతున్నారని నాయకులు విమర్శించారు. ధర్మవరం ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేయడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు.
గ్రామ కట్టుబాట్లు, సంప్రదాయాలను కాపాడాలంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన..
తమ గ్రామ కట్టుబాట్లు, సంప్రదాయాలను కాపాడాలంటూ అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం చిల్లవారిపల్లి గ్రామస్థులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. చిల్లవారిపల్లి కాటకోటేశ్వరస్వామి జాతర నిలుపుదల చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. దీంతో ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితుడిని పరామర్శించిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కలెక్టర్ గంధం చంద్రుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా చిల్లవారిపల్లి గ్రామస్థులు అనంతపురం కలెక్టరేట్ వద్దకు చేరుకొని అధికారులు తమ కట్టుబాట్లు, సంప్రదాయాల్లో తలదూర్చి గ్రామంలో ఘర్షణలకు తెరలేపుతున్నారని ఆరోపించారు.
సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన అధికారులు కులాల మధ్య చిచ్చుపెట్టే చర్యలకు పూనుకుంటున్నారని విమర్శించారు. చిల్లవారిపల్లి గ్రామస్థులంతా ఒక్కటిగా ఉండగా, అధికారుల ప్రవేశంతోనే ఘర్షణలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ గంధం చంద్రుడిని కలిసి వినతిపత్రం ఇవ్వటానికి గ్రామస్థులు ప్రయత్నించగా.. సమావేశంలో ఉన్నారని సిబ్బంది చెప్పటంతో అధికారులకు అందజేసి వెనుదిరిగారు.
ఇదీ చదవండి: