అనంతపురం జిల్లాలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మిరప పంట వేరు కుళ్లిపోయి పనికిరాకుండా పోయింది. భారీ వర్షాలకు అధిక తేమ వల్ల మిరపకు విల్ట్ అనే వైరస్ సోకింది. దాంతో పంట మొత్తం పాడైపోయింది. ఏటా కరవుతో విలవిల్లలాడే అనంత రైతులు.. ఈ ఏడాది అధిక వర్షాలతో అతలాకుతలమైపోయారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి వేసిన పంట పనికి రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వేల ఎకరాల్లో సాగు..
జిల్లాలోని విడపనకల్లు, వజ్రకరూర్ మండలాల్లో ఏటా వేల ఎకరాల్లో మిరప పంట సాగవుతోంది. గతేడాది మిరపకు మార్కెట్లో మంచి ధర పలకటంతో.. ఈ సంవత్సరం ఎక్కువమంది రైతులు మరిన్ని ఎకరాల్లో మిరపను సాగుచేశారు. ఎకరాకు సుమారు రూ.40వేలు కౌలు చెల్లించి మరీ మిర్చి వేశారు. వేలకువేలు పెట్టుబడి పెట్టారు. ధర ఆశాజనకంగా ఉండటంతో మంచి ఆదాయం వస్తుందని ఆశపడ్డారు. ఈ 2 మండలాల్లో సుమారుగా 6 వేల నుంచి 8 వేల ఎకరాల్లో మిరప సాగు ఉందని వ్యవసాయాధికారులు చెప్తున్నారు.
పంట తొలగించేస్తున్నారు..
అకాల వర్షాలు అన్నదాతల ఆశల్ని ఆవిరి చేశాయి. ఎడతెరిపిలేని వానలతో మిరపలో తేమ అధికమై వేర్లు కుళ్లిపోతున్నాయి. వైరస్ సోకి పంట పాడైపోయింది. చేసేందేంలేక రైతులు మిరప పంటను తొలగిస్తున్నారు. ఇప్పటికే 3 వేల ఎకరాల్లో మిర్చిని తొలగించినట్లు అధికారుల అంచనా. మిగిలిన వాటిలోనూ పంట బతుకుతుందన్న ఆశ లేదని రైతులు వాపోతున్నారు. కౌలు, పెట్టుబడులంటూ ఇప్పటికే ఎకరాకు రూ.లక్ష వరకూ ఖర్చు చేశామని చెప్తున్నారు. ప్రభుత్వాలు తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ రోదిస్తున్నారు.
ఇవీ చదవండి..