రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారావు, సీపీఎం నాయకులు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న పట్నం, చిప్పలమడుగు, ఎర్రదొడ్డి గ్రామాల్లో పర్యటించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తడిచిన వేరుశనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతులు నష్టపోతున్నా... ప్రభుత్వాలు ఆదుకోవటంలో పూర్తి విఫలమయ్యారని ఆరోపించారు.
జూన్లో సాగుచేసిన పంట.. కోత కోసే సమయంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా పడటంతో, పంట పూర్తిగా దెబ్బ తిన్నదని రైతులు వాపోయారు. వర్షంలో తడిచి, రంగుమారిన, మెులకెత్తిన వేరుశనగ కాయలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావటం లేదని నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.
పంటలను పరిశీలించి, రైతుల పరిస్థితులను తెలుసుకున్న రైతు సంఘ నేతలు ప్రభుత్వ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. అత్యధికంగా వేరుశనగను సాగు చేసే రైతులు ఇబ్బందులు పడుతున్నా.. వ్యవసాయ అధికారులు పరిశీలించకపోవటం బాధాకరమని అన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్తున్న ప్రభుత్వం.. అన్నదాతల నుంచి దెబ్బతిన్న ఉత్పత్తులను సేకరించలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే.. క్వింటాకు 600 రూపాయలకు తక్కువగానే మెుక్కజొన్నను రైతులు అమ్మకున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. పంటల నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు రూ.25 వేల నగదు పరిహారం ఇవ్వాలన్నారు. వ్యాపారుల వల్ల రైతులు నష్టపోకుండా, తడిచిన వేరుశనగను కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి: మంత్రి కొడాలిపై హిందూ ధార్మిక సంఘాలు భగ్గు