పోలీసులను అడ్డుపెట్టుకొని, డబ్బులు వెదజల్లుతూ జగన్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఏ అభ్యర్థి పోటీ నుంచి విరమించుకోవాలో డీఎస్పీలే నిర్ణయిస్తున్నారని.. ఈ చర్యలపై పోలీసులు సిగ్గుపడాలని ఆయన వ్యాఖ్యానించారు. వాలంటీర్లు డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోని పరిస్థితి నెలకొందన్నారు. అభ్యర్థులను ఎవరైనా బెదిరిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని... అలాంటిది పోలీసులే బెదిరిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలని రామకృష్ణ ప్రశ్నించారు. దొంగ స్వాములతో కోట్ల రూపాయలు డీల్ చేస్తున్న భాజపా నాయకులెవరో తేల్చాలని ఆ పార్టీ అధిష్టానాన్ని ఆయన డిమాండ్ చేశారు.
తిరుపతిలో చంద్రబాబుతో వ్యవహరించిన తీరు.. జగన్ వైఖరిని స్పష్టం చేసిందని తెదేపా ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. పంచాయతీ ఎన్నికలు మొదలు, మున్సిపల్ ఎన్నికల వరకు వైకాపా ప్రభుత్వం డబ్బులు పంచుతూ, పోలీసులతో అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలవాలని అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. తెదేపా అభ్యర్థులు ఎక్కడా భయపడకుండా పోటీలో నిలబడి సమాధానం చెబుతున్నారన్నారని బీటీ నాయుడు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని నేతలు అన్నారు.
ఇదీ చదవండి: