అనంతపురం జిల్లాలో రైతులందరికీ బీమా చెల్లించాలని అఖిలపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా బుక్కరాయసముద్రం సచివాలయాన్ని ముట్టడించారు. జిల్లాలో మూడేళ్లుగా పంట నష్టం జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ విమర్శించారు. ముఖ్యంగా 2018-19, 2019-2020 సంవత్సరాలకు సంబంధించి బీమా చెల్లించాలని.. శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను పోలీసులు అడ్డుకోవడం బాధాకరమన్నారు. పోలీసులు సైందవులుగా మారారన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలని సూచించారు.
"స్వయంగా ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో రూ.940 కోట్లు అందజేస్తామని చెప్పి ఇంత వరకూ ఇవ్వలేదు. అలాగే జిల్లాలో కేవలం 34 మండలాలకు మాత్రమే పంటల బీమా వచ్చింది. మిగిలిన 30 మండలాల రైతుల పరిస్థితి ఏంటి? పంటల బీమా వచ్చినా రైతుల ఖాతాల్లో వేయలేదు". -జగదీష్, సీపీఐ జిల్లా కార్యదర్శి
జిల్లాలో కరవు వచ్చి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని తెదేపా నాయకురాలు బండారు శ్రావణి శ్రీ అన్నారు. అగ్రికల్చర్ అధికారులు, వలంటీర్లు సక్రమంగా పని చేయడం లేదన్నారు. కేవలం అధికార పార్టీ సానుభూతిపరులను మాత్రమే బీమా లిస్టులో చేర్చారని ఆరోపించారు. అంతేగాకుండా అనేకమంది అనర్హులకు పథకం వర్తింపజేశారన్నారు.
"కనీసం పంటల పెట్టుబడిలో 25 శాతం కూడా దిగుబడి రాక నష్టపోయిన రైతులకు కనీసం తామున్నామని ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడం సిగ్గుచేటు. రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోయేందుకు కూడా జగన్ ప్రభుత్వం అవకాశం కల్పించకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు ఉద్ధృతమవుతాయి". -బండారు శ్రావణి శ్రీ, తెదేపా నాయకురాలు
ఇదీ చదవండి : 'తిరిగి విధుల్లోకి తీసుకోండి.. వేతన బకాయిలు చెల్లించండి'