![అనంతపురంలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8295173_949_8295173_1596552920526.png)
అనంతపురం జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రత్యేక లాక్ డౌన్, 144 సెక్షన్ అమలు చేస్తున్నా వైరస్ వ్యాప్తి మాత్రం ఆగటం లేదు. తాజాగా మంగళవారం విడుదల చేసిన కరోనా బులెటిన్ లో 1325 మంది వైరస్ బారిన పడ్డారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 18 వేల 801 మందికి వైరస్ సోకగా, వీరిలో 7727 మంది ప్రస్తుతం ఆసుపత్రి, హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. మంగళవారం జిల్లాలోని ఐదు కోవిడ్ ప్రయోగశాలలతో పాటు, సంచార వాహనాల ద్వారా తొమ్మిది వేల 176 నమూనాలు పరీక్షించగా, 1325 మందికి వైరస్ నిర్దారణ అయింది. తాజాగా 1715 మంది రోగులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
అనంతపురం,ధర్మవరంలోనే అత్యధికం
అనంతపురం నగరం నుంచే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ధర్మవరం పట్టణంలో కరోనా విజృభిస్తోంది. అత్యధికంగా నేత కార్మికులు జీవించే ధర్మవరం పట్టణంలో దాదాపు ప్రతి కుటుంబంలో ఒకరైనా ఈ వైరస్ బారిన పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నమోదైన కేసుల సంఖ్యను పరిశీలిస్తే అనంతపురం-248, ధర్మవరం-238, ఉరవకొండ-69, గుత్తి-66, గుంతకల్లు-60, హిందూపురం-51, పుట్టపర్తి-34, పామిడి-33, తాడిపత్రి, పెనుకొండల్లో 32 మంది చొప్పున కరోనా వైరస్ కు గురయ్యారు. వైరస్ సోకి ఆసుపత్రికి వచ్చిన వారిని మూడు, నాలుగు రోజులకే ఇంటికి పంపుతున్న వారిలో ఊపిరి తీసుకోలేని సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వైద్యం చేసి ఆరోగ్య వంతులుగా మార్చినట్లు చెబుతూ ముందుగానే డిశ్చార్చి చేస్తున్న రోగుల్లో మళ్లీ సమస్య తలెత్తుతున్న సంఘటనలు బాధితుల కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఇవీ చదవండి