కరోనా... చాప కింద నీరులా పాకింది. రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే అనంతలో తీవ్రత పెద్దగా లేదు. దిల్లీ, మక్కా వెళ్లొచ్చిన వ్యక్తుల ద్వారానే ఈ వైరస్ ప్రబలింది. కర్ణాటకలోని గౌరీబిదనూరుకు చెందిన ఓ వృద్ధురాలితో ఈ వ్యాధి జిల్లాలో మొదలైంది. ఆమెతో సహా పలువురు మక్కా వెళ్లొచ్చారు. ఆమెకు పురంలో కొందరితో బంధుత్వం ఉండటంతో వైరస్ వ్యాప్తికి మూలమైంది. ఆ కాంటాక్టుతోనే లేపాక్షిలో బాలుడు (10), మహిళ (34)కు మార్చి 29న ప్రప్రథమంగా కరోనా బయట పడింది. ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడగా.. అధికారులు అప్రమత్తం అయ్యారు. అయినా సరే... పురాన్ని నేటికీ వణికిస్తోంది. మొత్తం 54 కేసుల్లో... పురానివే 33. నలుగురు మృతుల్లోనూ ముగ్గురు అక్కడి వారే కావడం గమనార్హం.
రేయింబవళ్లు కృషి
కరోనా కట్టడికి యంత్రాంగం అహోరాత్రులు శ్రమిస్తోంది. ఇప్పటికీ అవిరళ కృషి సల్పుతోంది. కలెక్టర్ చంద్రుడు, జేసీ డిల్లీరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాల నియామకం జరిగింది. క్వారంటైన్ కేంద్రాలు.. ఐసోలేషన్ వార్డుల ఎంపిక, ఐసీయూ, నాన్ ఐసీయూ పడకల గుర్తింపుపై దృష్టి సారించారు. మరోవైపు... వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సైతం విశ్రాంతి లేకుండా చికిత్స చేస్తున్నారు. వీరి కృషితో 20 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. వందల మంది అనుమానితులకు సేవలు అందిస్తున్నారు. పాజిటివ్ వ్యక్తులు ఆస్పత్రుల్లో ఉన్నా జంకు భయం లేకుండా శ్రమిస్తున్నారు.
ఇవీ చూడండి...